కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన టిక్కెట్ తానే ప్రకటించుకునే విధంగా మాట్లాడారు! ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ అనే సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఆయన పదవీ కాలం కూడా దాదాపు మూడేళ్లు ఉంది. అయితే, వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన ఎప్పుడో డిసైడ్ అయిపోయారు! మునుగోడు నుంచే బరిలోకి దిగుతాననీ ఇప్పటికే వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈరోజు నల్గొండలో ఆయన మాట్లాడుతూ… మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదన్నారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం చాలా చేయాల్సి ఉందన్నారు. అందుకే, తాను ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాననీ, పార్టీ శ్రేణుల్ని సరైన దారిలో నడిపించడంతోపాటు, అక్కడి అభివృద్ధి పనుల కోసం సమర్థంగా కృషి చేయగలననే ధీమా వ్యక్తం చేశారు!
ఇంతకీ, పదేపదే మునుగోడు గురించీ.. తన ఎమ్మెల్యే టిక్కెట్ గురించీ ఎందుకు మాట్లాడుతున్నారంటే… ఆ సీటుకు ఆయనకే ఇస్తారన్న నమ్మకం లేదు! ఇంకోటి, ఆ సీటీను ఇప్పటికే పాల్వాయి స్రవంతికి పార్టీ ఇస్తుందనే ప్రచారమూ ఎప్పట్నుంచో ఉంది. దానికి అనుగుణంగానే ఆమె పార్టీ కార్యక్రమాలు ఎప్పట్నుంచో చేసుకుని వస్తూ ఉన్నారు కూడా! అయితే, మునుగోడుపై రాజగోపాల్ ఆశలు పెట్టుకున్న దగ్గర్నుంచీ.. దశలవారీగా ఆ టిక్కెట్ తనకు మాత్రమే ఇవ్వాలనీ, వేరేవాళ్లకు ఇస్తే గెలిచే పరిస్థితి ఉండదనే ఒక అభిప్రాయాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య, రాష్ట్ర నేతలపైనా, కుంతియాపైనా రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం సృష్టించాయో తెలిసిందే. సరిగ్గా, అదే సమయంలో మునుగోడు గురించి మాట్లాడుతూ… తనను ఆ నియోజక వర్గం ప్రజలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నారనీ, తననే గెలిపిస్తామని అంటున్నారని అన్నారు. ఇప్పుడేమంటున్నారంటే… పాల్వాయి స్రవంతికి సీటు ఇస్తే గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు, మునుగోడులో అభ్యర్థిగా తననే సీపీఐ నేతలు సపోర్ట్ చేస్తున్నారనీ చెబుతున్నారు! ఈ నియోజక వర్గం టిక్కెట్ నాదే, కాంగ్రెస్ గెలుపు నాదే అంటున్నారు!
రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టుగానే… మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి బాగు లేకుంటే, ఆయనా గెలవలేరు కదా! తనకు టిక్కెట్ ఇస్తే బాగుంటుందని అనడమూ సరైంది కాదు! ఎందుకంటే, గడచిన నాలుగేళ్లు మునుగోడులో స్రవంతి యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆమెను కాదని ఈయనకి టిక్కెట్ ఇస్తే… ఆమె వర్గం ఈయనకి మద్దతు ఇస్తుందన్న గ్యారంటీ ఏముంది..? అసమ్మతి తప్పదు కదా! మునుగోడు ప్రజలు తనని కోరుకుంటున్నారనీ, స్రవంతికి గెలిచే అవకాశం లేదని.. తనకు మాత్రమే టిక్కెట్ ఇచ్చి తీరాలనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం రాజగోపాల్ బాగానే ప్రయత్నిస్తూ ఉన్నారు! ఇప్పటికే పార్టీ అగ్రనేతలపై కొన్ని కామెంట్స్ చేసున్న రాజగోపాల్ టిక్కెట్ విషయమై… హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.