తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను అసంతృప్త వాదిని కానని.. నిరూపించేందుకు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న ప్రియాంకా గాంధీని కలిసేందుకు చాలా రోజులుగా ప్రయత్నించి శుక్రవారం కలిశారు. తాను అసంతృప్తి వాదిని కాదని.. కాంగ్రెస్ విజయం కోసం కలిసి పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే సోదరుడు రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తారా అని ప్రియాంక ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డితో పాటు చాలా మంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రియాంక నివాసం ఎదుట మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. నల్లగొండ, ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేస్తానని రావాలని ఆహ్వానించారు. ప్రతి పదిహేను రోజులకు ఓ సారి తెలంగాణకు రావాలని కోరానని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఇటీవల బీజేపీ డీలా పడటంతో.. వెంకటరెడ్డి.. పార్టీపై విమర్శలు చేయడం తగ్గించారు. గతంలో పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే తర్వాత చర్యలు తీసుకోలేదు. ఆయన కూడా సోదరుడితో పాటు బీజేపీలోకి వెళ్లిపోవడానికి రెడీ అయ్యారన్న ప్రచారం జరిగింది.కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిగా.. కాంగ్రెస్ లోనే ఉంటానని. చెబుతున్నారు.
కారణం ఏదైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై హైకమాండ్ నమ్మకం కోల్పోయింది. ఆయన నేతృత్వలో సభలు ఏర్పాటు చేస్తే ముఖ్య నేతలు కూడా రారని చెబుతున్నారు. పార్టీ తరపున నల్లగొండలో సభలు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్ని డీకే శివకుమార్ ద్వారా.. ప్రియాంకా గాంధీ కంట్రోల్ చేస్తున్నారు. వీరిద్దరికీ రేవంత్ రెడ్డి సన్నిహితులనే పేరుంది. అందుకే కోమటిరెడ్డి.. తాను సీనియర్ నని.. పార్టీకి విదేయుడ్నని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.