తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగన్ భజన చేస్తున్నారు. కేటీఆర్, కేసీఆర్ చెప్పినట్లుగా ఏపీలో జగన్ గెలుస్తున్నాడని అక్కడి తన మిత్రులు చెప్పారని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఎవరు ఆ మిత్రులు అంటే… కేసీఆర్, కేటీఆర్కు చెప్పిన వాళ్లే. వైసీపీ నేతలే. అటు బీఆర్ఎస్ అగ్రనేతలకు.. ఇటు కోమటిరెడ్డికి మధ్య కామన్ ఫ్రెండ్స్ వారే.
జగన్ గెలవాలని బీఆర్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. ఎందుకంటే… వారికి పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి కోమటిరెడ్డి ఓ టూల్ అవుతారు. జగన్ గెలిస్తే… ఇక్కడ కాంగ్రెస్ లోని ఆయన సన్నిహితులు కోమటిరెడ్డి, పొంగులేటి ద్వారా కాంగ్రెస్ ను చీల్చి.. రేవంత్ సర్కార్ ను కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. పొంగులేటి కృష్ణా జిల్లాలోని వైసీపీ అభ్యర్థుల మొత్తానికి ఫండింగ్ చేశారని రాజకీయవర్గాలు ఇప్పటికే తేల్చాయి. ఈ కోణంలోనే వారు తమ ఆశల్ని జగన్ మీద పెట్టుకున్నారు. గెలుస్తాడని అంటున్నారు.
నిజానికి ఏపీలో కాంగ్రెస్ ఉంది. షర్మిల పోరాడుతున్నారు. రేవంత్ విశాఖలో సభ పెట్టి ప్రచారం కూడా చేశారు. కానీ మిగతా కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కాంట్రాక్టర్ నేతలు మాత్రం.. జగన్ జపం చేస్తున్నారు. సొంతపార్టీపై వారికి ఎలాంటి కన్సర్న్ లేదని.. వారిదంతా ఇతర స్వార్థమేనని స్పష్టమవుతోంది. రేవంత్ గట్టిగా నిలబడి.. కాంగ్రెస్ ను రేసులోకి తీసుకువచ్చారు కాబట్టి కోమటిరెడ్డి ఉన్నారు కానీ లేకపోతే ఆయన బీజేపీలో చేరి ఉండేవారని ఇప్పటికే ఓ అంచనా గట్టిగానే ఉంది.