ఓపక్క అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న రోజున ‘ఛలో అసెంబ్లీ’ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి సిద్ధమౌతున్నారు. 27న ఓ పక్క అసెంబ్లీ మొదలైతే.. ఇంకోపక్క రైతులతో ఛలో అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, స్వచ్ఛందంగా వారు తరలి వస్తున్నారనీ, ప్రశాంతంగా ఈ నిరసన కార్యక్రమం సాగుతుందని కోమటిరెడ్డి చెబుతున్నారు. అడ్డుకునే ప్రయత్రాలు చేస్తే.. తెరాస సర్కారు పతనం అక్కడి నుంచే ప్రారంభం అని అంటున్నారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన విమర్శల్ని కూడా ఈ సందర్భంగా ఖండించారు. కేసీఆర్ మీద కోర్టుకు వెళ్లిన గుత్తా, ఇప్పుడు ఆయన పంచనే చేరి మమ్మల్ని విమర్శిస్తూ ఉండటం దురదృష్టం అన్నారు. ఆయన నల్గొండ ఎంపీ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా తాను రైతుల అభ్యున్నతి కోసమే కృషి చేస్తున్నాననీ, ఈ పోరాటం కూడా దాన్లో భాగమే అని చెప్పుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని భారీగానే నిర్వహించాలని కోమటిరెడ్డి చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఛలో అసెంబ్లీ విజయవంతం చేసుకోవడం ఆయనకు ఒక రాజకీయ అవసరం! ఎందుకంటే, కాంగ్రెస్ లో వర్గ పోరు తెలిసిందే. పీసీసీ రేసులో తానూ ఉన్నానని కోమటిరెడ్డి ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. అంతేకాదు, పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉంటానని కూడా గతంలో చాలాసార్లు చెప్పారు. తనకు అవకాశం ఇస్తే.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి మరీ పార్టీని గెలిపిస్తా అన్నారు. సో… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఛలో అసెంబ్లీని విజయవంతం చేసుకోవడం, తద్వారా అధినాయకత్వానికి తన ప్రతిభను చాటుకోవడం అనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, కోమటిరెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇతర నేతల సహకారం ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి.
ఇంకోపక్క.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా ఉంది. రేపోమాపో చేరిక అంటున్నారు. అధినాయతక్వం నుంచి కూడా ఆయన రాకకు ఆమోదం ఉంది. రేవంత్ పార్టీలోకి వస్తే సుస్వాగతం అంటూ కొంతమంది నేతలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే, రేవంత్ చేరికను వ్యతిరేకించిన కొద్దిమందిలో కోమటిరెడ్డి కూడా ఉన్నారని అంటారు! రేవంత్ ను పార్టీలో చేర్చుకోవద్దని అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేశారనే గుసగుసలూ ఉన్నాయి. ఒకవేళ రేవంత్ రాక ఖాయమైతే… ఆయనకు పార్టీలో అధిక ప్రాధాన్యత కచ్చితంగా లభిస్తుంది. అలాంటి డీల్ లేకపోతే రేవంత్ మాత్రం ఎందుకొస్తారు చెప్పండీ! మాస్ లీడర్ అనే ఇమేజ్ రేవంత్ కి ఉంది. కాబట్టి, ఆయనకు పార్టీ అధినాయకత్వం అధిక ప్రాధాన్యత కట్టబెట్టేలోగానే… తన ఉనికిని చాటుకోవడం అనేది కూడా కోమటిరెడ్డి వ్యూహంలో భాగంగా ఉందనేది విశ్లేషకుల మాట.