వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్ పోస్టర్ ను పట్టుకుని కొమ్మినేని శ్రీనివాసరావు ఏకంగా ఓ ఆర్టికల్ రాసి పడేశారు. దాన్ని సాక్షి పత్రికలో ఎడిటోరియల్ పేజీలో వేసేశారు. దాన్ని చూసి నమ్మేవాళ్లు ఉంటారో లేదో కానీ… మెజార్టీ నిజం తెలిసిన వాళ్లు మాత్రం పాపం వైసీపీ.. పాపం సాక్షి అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు.
ప్రధాన జాతీయ మీడియా సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయని అందులో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని ఓ గ్రాఫిక్ ప్లేట్ ను సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు వైరల్ చేశారు. అందులో ఉన్న కొన్ని మీడియా సంస్థల ప్రతినిధుులు అది ఫేక్ అని ఖండించారు కూడా. అయినా కొమ్మినేని అది నిజమేనని చెబుతూ ఎడిటోరియల్ ఆర్టికల్ రాసేశారు. ఆయా సంస్థల పేర్లను నిస్సంకోచంగా వాడుకున్నారు. దాన్ని సాక్షి ప్రచురించేసింది. ఆ ఆర్టికల్ చూసిన కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా.. ఎగ్జిట్ పోల్స్ వచ్చేది చివరి విడత పోలింగ్ ముగిసిన ఒకటో తేదీ సాయంత్రం కదా అనే డౌట్ వస్తుంది. కానీ వైసీపీ క్యాడర్ కు ఆ మాత్రం తెలివి కూడా ఉండదని వైసీపీ , సాక్షి పెద్దల భావన. అందుకే… పక్కా ఫేక్‌లను ప్రచారం చేస్తున్నారు.
సరే సోషల్ మీడియాలో అంటే ఇలాంటివి ప్రచారం చేసుకున్నారు. దాన్ని నమ్మేవారు నమ్ముతారు. సాక్షిలో వేసుకోవడం ఎందుకు ?. అంటే… ప్రజల్ని మోసం చేయడంలో.. పాఠకుల్ని మోసం చేయడంలో తమను మించిన వారు లేరని నిరూపించడానికే. తాము ఏది చెబితే అది నమ్మేసే పాఠకవర్గం ఉందని.. వాళ్లను అలా మోసం చేయడం తప్పు కాదని సాక్షి భావన.
నిజంగా వైసీపీకి సానుకూల వాతావరణం ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు..ఇంత ఫేక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏమీ లేకపోయినా…. పోలింగ్ అయిపోయినా ప్రజల్ని మోసం చేయాలనే ఓ అలవాటు మాత్రం మానలేకపోతున్నారు.