బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్ దిలీప్ కొణతంను సైబర్ క్రైమ్ పోలిసులు అరెస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో దిలీప్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిలీప్ గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరక్టర్ గా పని చేశారు. ప్రభుత్వం మారాక ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి నేతృత్వం వహిస్తున్న దిలీప్..రేవంత్ సర్కార్ ను బద్నాం చేసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులతో కేసులు కూడా నమోదు అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వ లోగో మార్పు సమయంలో అవాస్తవ ప్రచారం చేశారని కేసు నమోదు కాగా…ఇటీవల ఆసిఫాబాద్ జైనూరు ఘటనపై కూడా రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జైనూరు ఘటనపై వారం రోజులుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ 144సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అదే సమయంలో ఇలాంటి వాటిపై ఇటీవల రేవంత్ కూడా సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు.
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సర్కార్ ను అప్రతిష్టపాలు చేస్తున్నారని దిలీప్ ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.