వైఎస్ కొండారెడ్డి అరెస్ట్ ఏపీలో కలకలం రేపింది. ఎన్ని అరాచకాలు జరిగినా ప్రభుత్వ పెద్దల బంధువుల మీద ఈగ వాలనీయని పోలీసులు హఠాత్తుగా వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారన్నది చాలా మందికి మిస్టరీగా మారింది. అయితే చివరికి తేలిందేమిటంటే.. బీజేపీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి అరెస్ట్ చేయక తప్పలేదని. అంటే పై వారు ఆగ్రహిస్తే ఇక్కడ పులివెందులలో చిన్న గ్యాంగ్స్టర్లతో పాటు తామూ జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే కింది స్థాయి వ్యక్తిని జైలుకు పంపి.. ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఆ కొండారెడ్డి జైల్లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా పెద్ద తేడా లేకుండా సౌకర్యాలుటాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కానీ ఇంత కాలంగా అరాచకాలకు బలవుతున్న వారి పరిస్థితి ఏమిటి? అనంతపురం జిల్లాలో కాంట్రాక్ట్ సంస్థలపై దాడులు చేసిన దృశ్యాలు చాలా సార్లు బయటకు వచ్చాయి. ఇక బయటకు రాకుండా.. బెదిరింపులకు పాల్పడి.. వ్యాపార సంస్థల్ని కూడా లాగేసుకున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆటోమేటిక్గా చేతులు మారిపోయిన కొన్ని వందల వ్యాపార సంస్ధల యజమానులు ఎవరికీ తమ గోడు చెప్పుకోలేని పరిస్థితి. రాష్ట్రంలో ఎవరూ కాంట్రాక్టులు చేయడం లేదు. చేసే పనులన్నీ జాతీయ రహదారులవే. వాటి పనులు చేస్తున్న వారిన వదిలి పెట్టడం లేదు.
ఇప్పుడు ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ .. కర్ణాటక బీజేపీ ముఖ్య నేత శ్రీరాములు వియ్యంకుడిది కాబట్టి పై స్థాయి దాకా తీసుకెళ్లి అరెస్టులు చేయించగలిగారు. మరి ఏ అండ లేని వారి పరిస్థితి ఏమిటో ఎవరు చెబుతారు ? అధికారం అండతో సామాన్యుల ఆస్తుల్ని సైతం లాగేసుకుంటున్న ఉదంతాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ? వారికెవరు భరోసా ఇస్తారు ? ప్రైవేటు ఆస్తులపై దాడులకు తెగబడి… కబ్జా చేసి.. ఇది “పులివెందుల తాలూకా” వాళ్లది అని బోర్డులు పెట్టుకుంటున్న వారి అరాచకత్వానికి ఎవరు బదులిస్తారు?