వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై ప్రభుత్వం పెగాసస్ ప్రయోగించిందని ఆరోపిస్తున్నారు తన ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయని తనపై నిఘా కోసమే ప్రత్యేకంగా ముగ్గురు అధికారుల్ని పెట్టారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా సీఎం జగన్మోహన్ రెడ్డి మీదనే. ఆయన నేరుగా చెప్పకపోయినా పెగాసస్ వాడేది.. నిఘా పెట్టేది ప్రభుత్వమే. వీరందరికీ కోటంరెడ్డి తనదై నశైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను పన్నెండు సీక్రెట్ సిమ్ లు .. ఫోన్లు మెయిన్ టెయిన్ చేస్తున్నానని.. ఫేమ్ టైమర్, టెలిగ్రామ్ యాప్ లలో మాట్లాడుకుంటే రికార్డు చేయలేరని ఆయన ప్రకటించారు. తనపై నిఘా కోసం ప్రత్యేకంగా ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టుకోవచ్చని సలహా ఇచ్చారు.
క్రికెట్ బెట్టింగ్ కేసుల సమయంలో.. అప్పటి ఎస్పీ తన ఫోన్‌పై నిఘా ఉంచారన్నారు. ఈ సమాచారం తనకు తెలియడంతో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడేవాడినని తెలిపారు. 30 ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడెలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అయినా.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. తాను రాజకీయ వారసత్వంతో ఎదగలేదని, స్వతహాగా పోరాటాలతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని ఆరోపణలు చేశారు.
తనకు రాజకీయంగా అవకాశాలు వచ్చినా.. ఆ పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వాళ్లే అనుభవిస్తున్నారని.. ఇకపై ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు. తాను రాజకీయాల్లో ఖరాఖండిగా ఉంటానని.. తాను సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని.. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారు. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. మొత్తంగా కోటంరెడ్డి … వైసీపీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలకు ఓ క్లారిటీ వచ్చేసింది.