జగన్ రెడ్డి ఇడుపులపాయలో తండ్రి సమాధికి నివాళులు అర్పించి నేరుగా కృష్ణలంక వెళ్లారు. అక్కడ దేవినేని అవినాష్ తో పాటు మరికొంత మంది నేతలు జనాల్ని పోగేశారు. జగన్ ఎయిర్ పోర్టుకు వెళ్లటప్పుడు.. వచ్చేటప్పుడు షో చేసేది వీళ్లే. అక్కడ వీళ్లంతా కలిసి.. మీరు రిటైనింగ్ వాల్ కట్టకపోతే ఈ పాటికి మేముంతా కొట్టుకుపోయేవాళ్లమని చెప్పుకొచ్చారు. వాళ్లకిచ్చిన స్క్రిప్టు అది. జగన్ ముసి ముసినవ్వులు నవ్వుకుంటూ పోయారు.
నిజానికి నిన్నంతా వైసీపీ సోషల్ మీడియా ఇదే ట్రెండ్ చేసింది. జగన్ రిటైనింగ్ వాల్ కట్టించాడని చెప్పుకున్నారు. ఆ ప్రచారం బాగుందని.. దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి జగన్ కేవలం కృష్ణలంకకే వెళ్లారు. అయితే నిజంగా ఆ రిటైనింగ్ వాల్ ఎవరు కట్టాలో అదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. 2018 నాటి వీడియోలు వైరల్ అయ్యాయి. 2019లో జగన్ గెలిచే నాటికే 140 కోట్ల వరకూ ఖర్చు పెట్టి ప్రభుత్వం నిర్మించేసింది. చివరి దశకు పనులు వచ్చాయి.
2019లో కృష్ణకు వరదలు వచ్చినప్పుడు ఈ రిటైనింగ్ వాల్ వల్ల చాలా మేలు జరిగింది. ఈ వాల్ పై నిలబడి అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని ఫోటోలు కూడాదిగారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ. .. ఈ రిటైనింగ్ వాల్ తానే కట్టించానంటూ.. ప్రచారం చేసుకునేందుకు జగన్ వచ్చేశారు. ఐదేళ్ల కాలంలో ఒక్క మంచి పని చేసినా చెప్పుకోవడానికి ఉండేది. అదేమీ లేకపోవడం వల్ల… ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పనులే చెప్పుకోవాల్సి వస్తోంది. నవ్వుల పాలవుతున్నా.. ఆ విధానాన్ని మాత్రం ఆపడం లేదు.