ఏపీ ప్రయోజనాల గురించి ఇటీవల బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. పోలవరం మేమే పూర్తి చేస్తామని మల్లారెడ్డి లాంటి మంత్రి కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా కేటీఆర్ ప్రకటనలు చేశారు. అయితే అసలు ఏపీ కోసం మాట్లాడాల్సిన సమయంలో చోట మాత్రం రాజకీయం తిరగబడింది. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నీటిని కూడా తమకే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా డి్మాండ్ చేస్తూ పంచాయతీని కేంద్రం ముందు పెట్టింది. ఇది ఇప్పుడు ఏపీలో విస్తృత చర్చకు కారణం అవుతోంది.
ఏపీకి న్యాయంగా కేటాయించిన నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. రెండు రాష్ట్రాల మధ్యన 2015 – 16లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణానదీజలాల వినియోగంలో ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన 66:34 నిస్పత్తిలో నీటికేటాయింపులు కుదుర్చుకున్నాయి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే ఉంది. బచావత్ చేసిన 811టీఎంసీల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 299టిఎంసీలు, ఏపికి 512టింసీలు వినియోగించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందమే ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోంది.
అయితే తమకు యాభై శాతం వాటా కావాల్సిందేనని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటోంది. గతంలోలా కాదని కృష్ణా జలాల్లో సగం వాటా కావాల్సిందేనని పట్టుబడుతోంది. ఏపీ దిగువ రాష్ట్రం.. చివరికిగా నీళ్లు సముద్రంలో కలిసేది ఏపీలోనే ., అలా కలిసిపోయే నీళ్లన్నింటినీ ఏపీ ఖాతాలో వేయాలన్నట్లుగా వ్యవహరిస్తూంటంతో.. ఇదేనా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడటం అని బీఆర్ఎస్ నేతల తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. బేసిన్లు, బేషజాలు లేవని కేసీఆర్ చేసిన ప్రకటన అంతా డొల్లేనని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఏపీలో రాజకీయం గురించి బీఆర్ఎస్ మర్చిపోతుందేమో ?