కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ… అలా అనుకోవడం లేదు. ఓన్లీ తెలంగాణ అన్న ట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం పెద్ద తప్పని.. ఏపీ రాజకీయాల గురించి ఎక్కడ ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ ఆ మాటలు అన్న వెంటనే…. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దేశ్ కీ నేత పేరుతో దేశవ్యాప్తంగా చేసిన పర్యటనల్ని నెటిజన్లు హైలెట్ చేశారు. ఈ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు ?
చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల ర్యాలీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కంపెనీలకు పోలీసులతో హెచ్చరికలు జారీ చేయించారు. వీలైనంతగా అడ్డుకున్నారు. ఐటీ ఉద్యోగులు శాంతియుత నిరసనలు తెలుపుతారు కానీ విధ్వంసం చేయరు. చేస్తే వారికే నష్టం. అయినా వాటినీ అడ్డుకున్నారు. ఏపీ రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఇదే బీఆర్ఎస్ నేతలు … ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన నేతల తెలంగాణలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. కేటీఆర్ ఈ ప్రకటన చేస్తున్న సమయంలోనే బండి రమేష్ అనే కీలక నేత రాజమండ్రి వెళ్లి భువనేశ్వరికి సంఘిభావం ప్రకటించారు. మరి వీటికి కేటీఆర్ ఏమంటారో ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు ప్రజాస్వామికంగా తమ నిరసనలు వ్యకతం చేసుకోవడానికి అవకాశం ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది రాజకీయమా కాదా అన్నది పక్కన పెడితే.. చంద్రబాబు అరెస్టుపై తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా నిరసనలు జరుగుతున్నాయి. ఎక్కడా మీ రాష్ట్రంలోని ఇక్కడెందుకు అని అడ్డుకోలేదు. ఒక్క తెలంగాణలోనే ఎందుకు అడ్డుకున్నారు ?. పైగా బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ ఏపీలో కూడా ఉంది. దానికో చీఫ్ కూడా ఉన్నారు. అయినా ఏపీ రాజకీయాలుఇక్కడెందుకని ఎందుకన్నారు ?
కేటీఆర్ సోషల్ మీడియాలో చేసిన ఓ కామెంట్ వైరల్ అయింది. అది సెటిలర్లపై ప్రభావం చూపుతుందనుకునేలోపు… ఆయన తాజాగా మాట్లాడిన మాటలు మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.