తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు. గవర్నర్ ప్రసంగం రోజున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొనలేదు. నిజానికి సభాధ్యక్షుడు అయిన కేసీఆర్ ఈ తీర్మానానికి సమాధానం చెప్పాలి. కానీ కేటీఆర్ ఆ బాధ్యత తీసుకున్నారు. విపక్షాల విమర్శలన్నింటికీ ఆయనే సమాధానం చెప్పారు. తర్వాత తీర్మానం ఆమోదం పొందింది.
కేసీఆర్ ఇలా తన బాధ్యతల్ని అసెంబ్లీలో కూడా కేటీఆర్కు అప్పగించడంపై బీఆర్ఎస్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ప్రో బీఆర్ఎస్ మీడియాగా పేరు పడ్డ కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లో కేటీఆర్ త్వరలో సీఎం అనే ప్రచారం కూడా ప్రారంభించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం అంటూ.. పదవి నుంచి వైదొలిగి..కేటీఆర్ ను సీఎం చేస్తారని.. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలు జరుపుతారని ఈ కథనాలతో ఊహాగానాలు ప్రారంభమ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది.
అయితే ముందస్తుకు వెళ్లడం.. లేకపోతే.. కేటీఆర్ ను సీఎం చేయడం.. ఈ రెండింటిలో కేసీఆర్ ఓ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా నమ్ముతున్నారు. బడ్జెట్ ను కూడా మార్చికి బదులు ఫిబ్రవరిలోనే పెట్టడం.. అసెంబ్లీ సమావేశాలు కూడా వేగంగా పూర్తి చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. సచివాలయం ప్రారంభం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక మలుపులు ఉంటాయన్న నమ్మకం ఎక్కువగా తెలంగాణ అధికార పార్టీలో ఉంది.