బీజేపీ – బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా అంగీకరించినట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.
ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్ లో మాట్లాడిన కేటీఆర్…రాష్ట్రంలో 10 -12స్థానాలు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్ తెలంగాణను శాసిస్తారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 10 -12స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తెలంగాణను ఎలా శాసిస్తారని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే కేంద్రంలో హాంగ్ వస్తోందని పదేపదే చెప్తున్న కేసీఆర్, రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీతో పొత్తు కోసం కేంద్రంలో బీజేపీకి మద్దతునిస్తారా..??అని కేటీఆర్ వ్యాఖ్యలతో చర్చ మొదలైంది.
ఇప్పటికే బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణులకు ఊరటనివ్వకపోగా…కాంగ్రెస్ కు మరింత మేలు చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.