సెక్రటేరియట్లో ఆవిష్కరణకు సిద్ధం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి రాజీవ్ గాంధీకి అసలు ఏమిటి సంబంధమని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం తీసేయకపోతే.. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తీసేయడమే కాదు.. రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరు కూడా మార్చేస్తామని హెచ్చరించారు.
తాము పదేళ్లు అధికారంలో ఉన్నా… రాజీవ్ గాంధీ పేరు మార్చలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెడితే.. ఎయిర్ పోర్టుకు పీవీ నరసింహారావు లేదా జయశంకర్ పేరు పెడతామన్నారు. నిజానికి ఎయిర్ పోర్టుల పేర్లు పెట్టేది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు.. కేంద్రం చేతుల్లో ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేయవచ్చు.
సెక్రటేరియట్ ను తెలంగాణ అస్థిత్వానికి తగ్గట్లుగా ఉండాలని పాత బిల్డింగ్లను కూల్చేసి కొత్త సెక్రటేరియట్ ను తన అభిరుచికి అనుగుణంగా కేసీఆర్ కట్టించారు. కానీ అందులో నుంచి పాలన చేసే అవకాశం రేవంత్ కు దక్కింది. పదవి చేపట్టిన వెంటనే సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆవిష్కరణకు సిద్ధమయింది. అసలు రాజీవ్ కు.. తెలంగాణ సెక్రటేరియట్ల కు సంబంధం ఏమిటని .. బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.