తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఇప్పుడు నైరాశ్యం అలుముకుంది. హుజురాబాద్ ఫలితంతో భవిష్యత్‌పై బెంగ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అందరి చూపు కేటీఆర్వైపే ఉంది. కేటీఆర్ కూడా ఈ ఫలితం తమ మీద ఎలాంటి ప్రభావం చూపదని ట్వీట్ చేయడమే కాదు.. వెంటనే ప్రజల్లోకి వెళ్తున్నారు. నిన్న నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లి ఓ అత్యాచార బాధిత కుటుంబానికి పరామర్శించి భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆయన తమ విజయగర్జన సభపై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంది. పరాజయం ఎదురైన తర్వాత విజయగర్జన నిర్వహించడం దాన్ని సక్సెస్ చేయడం చిన్న విషయం కాదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి పార్టీ క్యాడర్‌ను బయటపడేయడానికి పార్టీ హైకమాండ్‌కు వరంగల్‌లో నిర్వహించాలనుకున్న విజయగర్జన సభ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది., అయితే ఇప్పుడు ఆ సభను సక్సెస్ చేయడమే కీలకం. అందర్నీ భాగస్వాములను చేసేలా ఉత్సాహం నింపడానికి కేటీఆర్ శక్తివంచనలేకుండా ప్రయత్నించాల్సి ఉంది. హుజురాబాద్ ఫలితం అనుకున్నట్లుగా రాకపోవడం విజయగర్జనను ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ చేయాల్సిన బాధ్యత కేటీఆర్‌పై పడ్డాయి.
టీఆర్ఎస్కు ముందు ముందు పరిస్థితులు అంత సజావుగా ఉండే అవకాశం లేదు. జన సమీకరణ అంత గొప్పగా సాగడం చాలా కష్టంగా మారనుంది. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో హైదరాబాద్ శివారులో నిర్వహించిన సభ విషయంలోనూ కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆ సభపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం కేటీఆర్‌కే కాదు పార్టీకి కూడా ఎంతో మఖ్యం.