ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ సందడి కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ సారి చీరను సిద్ధం చేయించారు. పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు కూడా. గతంలో చీరల పంపిణీ సమయంలో ప్రభుత్వం కొన్ని విమర్శలు ఎదుర్కొంది. ఈ సారి ఆ విమర్శలకు తావు లేకుండా.. 287 విభిన్నమైన డిజైన్లలో బంగారు, వెండి, జరి అంచులతో తయారీ చేసిన పాలిస్టర్ ఫిలిమెంట్, నూలు చీరెలను సిద్ధం చేశారు. బతుకమ్మ పండుగ కోసం.. మహిళలకు ఈ కానుక ప్రభుత్వం అందిస్తోంది. ఈ చీరల కోసం రూ.317 కోట్లు వ్యయం చేశారు.
మొదటి సారి చీరల పంపిణీ జరిగినప్పుడు మహిళలు పెదవి విరిచారు. కొన్నిచోట్ల ఆందోళనలకు దిగారు. దీంతో తర్వాత ఏడాది నుంచి నాణ్యమైన చీరల ఉత్పత్తిని ప్రారంభించారు. ఈసారి చీరల తయారీకి 20 వేల మంది కార్మికులు 18 వేల మరమగ్గాలపై నిరంతరం పని చేశారు. కేటీఆర్ సొంత నియోజకవర్గ సిరిసిల్ల కార్మికులకే ఎక్కువ ప్రయోజనం లభించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కొత్త డిజైన్లతో తమ ప్రతిభను చూపించింది. కరోనా కారణంగా ఈసారి ఇంటింటికీ చీరలను పంపిణీ చేయబోతున్నారు.
ఇంటి బంధువుగా చీర పంపితే .. దాన్ని మహిళలు మనసారా తీసుకంటే.. కేటీఆర్‌ను కుటుంబసభ్యుడిగా మహిళలు చూస్తారనడంలో సందేహం లేదు. సెంటిమెంట్ ప్రకారం.. బతుకమ్మ పండుగకు తోబుట్టువుకు.. చీర పెడుతున్నారన్న భావన మహిళల్లో కల్పించడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందుకే.. మహిళలను నిరాశపర్చకుండా.. మంచి మంచి డిజైన్లతో.. క్వాలిటీగా చీరలను ఉత్పత్తి చేయించి పంపిణీ చేయిస్తున్నారు కేటీఆర్. ఇది ఆయనకు ఆత్మబంధువుల్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.