సోనియా గాంధీలా ఈడీ, సీబీఐ కేసులను కేసీఆర్ ఎదుర్కోవాల్సిందేనని.. త్వరలోనే హాజరవక తప్పదని బండి సంజయ్ అన్నారు. నిజానికి బండి సంజయ్ మొదటి సారి అలా అనలేదు. చాలా రోజులుగా అంటున్నారు. అయితే ఈ సారి మాత్రం గతంలో కన్నా ఎక్కువగా టీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. స్వయంగా కేటీఆర్ కూడా స్పందించారు. మోదీకే ట్వీట్ చేసి.. బండి సంజయ్‌ను ఈడీ చీఫ్ గా నియమించినందుకు కృతజ్ఞతలు అంటూ సెటైర్ వేశారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఇంత హైలెట్ ఎందుకు చేస్తోందన్న అనుమానం సహజంగానే వస్తుంది.
బీజేపీకి ఎదురుతిరిగితే సీబీఐ, ఈడీ కేసులు పెడతారన్న ఓ అభిప్రాయం ఉంది. అయితే అవేమీ తప్పుడు కేసులని మాత్రం ఎవరూ చెప్పరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో ఓ సమయంలో తప్పులు చేయక తప్పదు. అవి దొరికిపోయే తప్పులైతే రాజకీయ నేతల జుట్టు అధికారంలోకి వచ్చే వారి చేతుల్లో ఉంటుంది. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన సమయంలో.. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంలో లోపాలు కేంద్రం కనిపెట్టే ఉంటుందని అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తోందన్న అనుమానం కూడా ఉంది.
అయితే బీజేపీ రాజకీయంగా టార్గెట్ చేస్తే.. త్రివిధ దళాలుగా చెప్పుకునే సీబీఐ, ఐటీ, ఈడీ లు ఏకపక్షంగా దాడి చేస్తాయి. తాజాగా ఢిల్లీ లో అదే జరుగుతోంది. ప్రజలు ఏమనుకుంటారోనని ఆలోచించే పరిస్థితి లేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆసరా చేసుకునే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆ ప్రకారం బండి సంజయ్ కూడా ప్రజల్ని .. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ క్యాడర్‌ను కూడా కేసీఆర్ కేసులు ఎదుర్కోక తప్పదని మానసికంగా సిద్ధం చేస్తున్నారని అనుకోవాలి. ఎక్స్ పెక్టెడ్ అయితే వచ్చే స్పందన తగ్గిపోతుదంది. ఇలాంటి వ్యూహాల్లో బీజేపీ రాటుదేలిపోయింది. కానీ టీఆర్ఎస్సే తమపై బీజేపీ కక్ష సాధించబోతోందని గగ్గోలు పెట్టాలని అనుకుంటోంది. కానీ అనుకున్నంత ఎఫెక్ట్ రావడం లేదు.