తెలంగాణ రాజకీయ వర్గాల్లో మంత్రి కేటీఆర్ కు సంబంధించి ఈ మధ్య ఒక కథనం బాగా చర్చనీయం అయిన సంగతి తెలిసిందే! అదేనండీ.. వచ్చే ఎన్నికల్లో, అంటే 2019లో కూకట్ పల్లి నియోజక వర్గం నుంచీ కేటీఆర్ పోటీ చేస్తారన్న విషయం! తెరాస కాస్త వీక్ గా ఉన్న ప్రాంతాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారనీ.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనీ వార్తలు వచ్చాయి. దీన్లో భాగంగానే కేటీఆర్ ను కూకట్ పల్లి నుంచీ పోటీకి దింపాలని అనుకున్నట్టూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కూకట్ పల్లిలో సెటిలర్లు ఎక్కువ కాబట్టీ, కేటీఆర్ పై వారిలో పాజిటివ్ ఇమేజ్ ఉంది కాబట్టి, పైగా కేటీఆర్ ప్రభావం చుట్టుపక్కల నియోజక వర్గాలపై కూడా పనిచేస్తుందని అంచనా వేశారు! భవిష్యత్తు రాజకీయలను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజక వర్గానికి గుడ్ బై చెప్పేయ్యొచ్చు అనే అభిప్రాయం తెరాస వర్గాల్లోనే ఈ మధ్య వినిపించింది.
అయితే, ఈ అంశంపై తాజాగా కేటీఆర్ స్పందించారు. సిరిసిల్లలో పర్యటించిన ఆయన, నియోజక వర్గ మార్పు గురించి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని నియోజక వర్గం నుంచి పోటీకి దిగుతా అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను సిరిసిల్లను విడిచి వెళ్లడం అనేది జరగదని అన్నారు. అంతేకాదు, తాను రాజకీయ జీవితంలో ఉన్నంత కాలమూ సిరిసిల్ల ప్రజలతోనే ఉంటాననీ, ఇక్కడి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుంటానని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల ఆత్మ గౌరవం బతికేలా, నేతన్నల జీవితాల్లో వెలుగులు వచ్చేలా తాను పనిచేస్తూనే ఉంటానని చెప్పారు. అన్ని రంగాల్లోనూ సిరిసిల్లను అగ్రగామిగా నిలుపుతామన్నారు. సో.. నియోజక వర్గ మార్పు విషయమై ఇటీవల వినిపిస్తూ వస్తున్న కథనాలపై కేటీఆర్ స్పష్టత ఇచ్చేశారు.
అయితే, హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ లో ముందెన్నడూ లేని విధంగా తిరుగులేని మెజారిటీ సాధించి పెట్టారు. ఆ అనుభవంతోనే శాసన సభ ఎన్నికల్లో పార్టీ బాధ్యతల్ని కేటీఆర్ కే అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలే చెప్పాయి. అయితే, ఇప్పుడు ఆ వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో కేటీఆర్ పోటీ చేయాల్సిన అవసరం లేదనీ, ప్రచారంతోపాటు అక్కడి అభ్యర్థుల ఎంపిక విషయంలో శ్రద్ధ తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారట! సిరిసిల్లను వదిలేసి, కూకట్ పల్లికి వెళ్తే… మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వారి అంచనాగా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ సర్కారు ఆంధ్రా కాంట్రాక్టర్లకు మేలు చేస్తోందన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి వంటి నియోజక వర్గానికి కేటీఆర్ వెళ్తే అదే తరహాలో మరిన్ని విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో.. ఈ అంచనాలతోనే కేటీఆర్ నియోజక వర్గ మార్పు నిర్ణయంపై వెనక్కి తగ్గి ఉంటారని అంటున్నారు.