స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయాలని హైదరాబాద్లో 40 ఎకరాలు ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకున్న తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ ఆదేశించినట్లుగా కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖ చాలా సందేహాలను లేవనెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ లో ఏపీ ప్రభుత్వానికి… వాటా లేదు. పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉంది. అది ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం పోరాడుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే.. తాము ఉన్నామంటూ ముందుకొచ్చిన కేటీఆర్కు అనేక ప్రశ్నలు ఎదురు వస్తున్నాయి. అదేమిటంటే.. ఏపీకి న్యాయంగా ఇవ్వాల్సిన ఆస్తులు , బిల్లులు , నిధులు ఎందుకివ్వడం లేదనే ? ప్రాజెక్టులపై ఎందుకు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారనే ?
ఏపీకి రావాల్సిన ఉమ్మడి ఆస్తుల్ని పంచివ్వండి కేటీఆర్ సారూ..!
విభజన పేరుతో సుసంపన్న హైదరాబాద్ ఒక్క తెలంగాణకే పరిమితయింది. అంతేనా ఉమ్మడి సంస్థల ఆస్తులన్నీ తెలంగాణకే ఉన్నాయి. విభజించి.. ఏపీకి న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం లేదు. ఏపీ పాలకుల్ని బ్లాక్ మెయిల్ చేసి.. లక్షల కోట్ల ప్రజాధనాన్ని తెలంగాణ ఉంచేసుకుంది. చివరికి వాడుకున్న కరెంట్ కు బకాయిలు కూడా చెల్లించడంలేదు. రెండు ప్రభుత్వాలు కుమ్మక్కయి.. న్యాయపోరాటం అని.. కేంద్రం దగ్గర పంచాయతీ అని ప్రజల్ని మోసం చేస్తున్నారు కానీ… రావాల్సిన వాటిని మాత్రం ఇవ్వడం లేదు. ఏపీకి న్యాయంగా కొన్ని లక్షల కోట్ల ఆస్తులు రావాల్సి ఉంది. కానీ ఎందుకివ్వడం లేదు ? ఎనిమిదేళ్లుగా ఏపీ హక్కుల్ని ఎందుకు నలిపేస్తున్నారు ?
దిగువ రాష్ట్రమైన ఏపీ నీటి హక్కుల్ని ఇవ్వండి కేటీఆర్ సారూ !
తెలంగాణ నీరు ఆంధ్రోళ్లు ఏం తీసుకున్నారో కేసీఆర్ ఇప్పటికీ చెప్పలేదు. చెప్పరు కూడా. ఎందుకంటే… అత్యంత దిగువ రాష్ట్రం ఏపీ. పై నుంచి ఎవరైనా దలతలిచి వదిలితే వచ్చే నీళ్లే రాయలసీమకు.. ఆంధ్రకు వస్తాయి. ఇంకా వరదలు వచ్చి పై రాష్ట్రాలు నిల్వ చేసుకోలేనంత నీరు వస్తేనే దిగువకు వస్తాయి. ఇది నిజం అయితే… ఎడాపెడా పైన ప్రాజెక్టులు కట్టేసుకుంటూ.. ఆంధ్రోళ్ల మీద ఏడ్చిన ఏడుపులు ఎవరికీ గుర్తుండవని అనుకుంటున్నారా ?. లెక్క లేనంత వరద వచ్చినా రాయలసీమ ప్రజలు నీటి కటకటకు గురవుతున్నారు. తెలంగాణ ఇచ్చినందుకు ఏపీకి నికరంగా లభించింది ఒకే ఒక్క వరం పోలవరం. దానిపై తెలంగాణ పెడుతున్న లొల్లి అంతా ఇంతా కాదు. ఏడు మండలాలు మళ్లీ కావాలంటూ చేస్తున్న రచ్చ కళ్ల ముందే ఉంది. డిజైన్ మార్చాలనే సన్నాయి నొక్కులు లెక్కే లేదు. ఇప్పుడు జల వివాదాలు రెట్టింపయ్యాయి. కృష్ణా, గోదావరి బోర్డుల పంచాయతీ తేలడం లేదు. ఏపీ నీళ్లను కూడా ఏపీ వాడుకోకుండా చేస్తున్నారు… మరి ఆపేసిన హక్కుల్ని కేటీఆర్ ఇవ్వరా ?. ఇక్కడ ఏపీ హక్కులు పట్టవా ?
హక్కులిస్తేనే నమ్ముతారు.. లేకపోతే !
వైజాగ్ స్టీల్ తెలుగు ప్రజల హక్కు అని నినదిస్తే… ప్రజలు ఫ్లాట్ అయిపోయి.. మీ వెంట నడుస్తారనుకుంటే … అంతకంటే అమాయకత్వం ఏమీ ఉండదు. ఏపీ ప్రజలు కులపిచ్చిగాళ్లని… తాము ఓ కాపుని నేతగా పెడితే కాపులంతా ఓట్లేస్తారని ఆశిస్తే అంతకు మించిన పిచ్చితనం ఉండదు. వారికి రాష్ట్రాభివృద్ధి పట్టదని దానికి ఎన్నికల ఫలితాలే సాక్ష్యమని అనుకుంటే అంతకంటే తప్పుడు ఆలోచన ఉండదు. ఏపీ ప్రజలకైనా తమ హక్కులే ముఖ్యం. కాదు కూడదని మీరు అదే రాజకీయం చేస్తే… నిరూపించడానికి కూడా సిద్దంగా ఉంటారు.