తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం బీఆర్ఎస్ అని కేటీఆర్ నినాదం ఇస్తున్నారు. కానీ ఆయన బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నారు. తన పార్టీ టీఆర్ఎస్ అయితే….. ఆయన ఆ నినాదం ఇచ్చినా సరిపోయేది.కానీ తనది జాతీయవాదం అని.. పార్టీ పేరు మార్చుకుని ఇప్పుడు పాతాళంలోకి పడిపోయాక.. మళ్లీ పైకి రావడానికి అదే తెలంగాణను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.
సెంటిమెంట్ అనే కవచ కుండలాల్ని వదిలేసినప్పుడు అనిపించలేదా ?
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులో ఓ ఎమోషన్ ఉంది. అది తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసు. తెలంగాణ వాదం నరనరాన నింపుకున్న వారికి మాత్రమే అనుభవమవుతుంది. ప్రతి రాజకీయ పార్టీలు కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. చాలా పార్టీలకు కులం.. బీజేపీకి మతం వంటివి ఓటు బ్యాంకులు. కానీ టీఆర్ఎస్కు ఓటు బ్యాంక్ తెలంగాణ వాదం. కుల, మతాలకు అతీతంగా తెలంగాణ వాదమో ఓటు బ్యాంక్. ఓ రకంగా ఈ సెంటిమెంటే బీఆర్ఎస్కు కవచ కుండలాలు కానీ.. కేసీఆర్ ఏం ఆలోచించారో కానీ..జాతీయ నాయకుడు అయిపోవాలన్న ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ ను వదిలేసుకున్నారు. తన పార్టీ పేరు నుంచి తెలంగాణ తీసేశారు. భారత్ అని తగిలించుకున్నారు. తెలంగాణ కోసం ఎంతో చేశామని ఇక దేశానికి చేయాల్సి ఉందని.. అందుకే జాతీయ వాదాన్ని అందుకున్నామన్నారు.
ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయలేని దుస్థితి !
ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయలేని దుస్థితి. తెలంగాణ వాయిస్‌ను మాత్రమే పార్లమెంట్ లో వినిపిస్తామని బీఆర్ఎస్కే ఓటేయాలని అడగలాని విధానంగా పెట్టుకున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పోటీ ఆలోచన కూడా ఉండదు. గతంలో మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి యాభై లోక్ సభ సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్, కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు .. మహారాష్ట్ర వైపు చూసేందుకు కూడా తీరిక ఉండటం లేదు. చివరికి కేసీఆర్ కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తే.. తెలంగాణ కోసమే నిలబడతామన్న తమ ప్రకటనలకు విలువ ఉండదని అందుకే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
మూలాలు వదిలేస్తే వినాశనమే.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన ఏడాది తర్వాత తిరిగి చూసుకుంటే.. చేజేతులా చేసుకున్న వినాశనమే కనిపిస్తోంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ వాదంతోనే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పడిన దెబ్బ నుంచి కోలుకునేందుకు లోక్‌సభ ఎన్నికల్లో కనీస సీట్లు సాధించేందుకు వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ ను అద్దెకు తెచ్చుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనే కవచ కుండలాలతో మళ్లీ పోరాటానికి సిద్ధమయింది. కానీ వాటి పవర్ ఇంకా ఉందా లేదా అన్నది మాత్రం ఫలితాల తర్వాతే తేలుతుంది. కానీ తెలిసి చేసిన ఓ తప్పు తమ పార్టీని క్రమంగా దహించి వేస్తోందని బీఆర్ఎస్ పెద్దలకు ఇప్పటికైనా అర్థమయి ఉంటుంది.