సాఫ్ట్ వేర్ రంగంలో అద్భుతాలు చేయాలనుకుంటే.. టీ హబ్ ఉంది. మరి హార్డ్ వేర్ రంగంలో ఆలోచనలకు పదును పెట్టి కొత్త యంత్రాలు తయారు చేయాలంటే ఎలా ?. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలను యువకులు చేస్తూంటారు. చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారికి సరైన మౌలిక సదుపాయాలు ఉండవు. పరికరాలు దొరకవు. అందుకే.. ఇలాంటి ఔత్సాహికుల్లో 95 శాతం మంది తమ ఆలోచనల్ని వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి వారి క్రియేటివిటీ వృధా పోకుండా.. కేటీఆర్ టీ వర్క్స్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. సిద్ధం చేయించారు. అది ఈ రోజే ప్రారంభం కాబోతోంది.
ఐటీ కారిడార్‌లోని ఐటీ హబ్ పక్కనే 4.7 ఎకరాల్లో సుమారు 200 కోట్లతో టీ-వర్స్ను నిర్మించారు. తయారీ యంత్రాలను అందుబాటులో ఉంచారు. సృజనాత్మకతగలవారు ఎవరైనా ఆలోచనతో వచ్చి ఒక పూర్తిస్థాయి ఉత్పత్తి నమూనాతో తిరిగి వెళ్లేలా, అన్ని విధాలుగా సహకరించే యంత్రాంగం ఒకే చోట కొలువుదీరి ఉంటుంది. మొదటి దశలో 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ అవసరాలకు ఉపయోగించే ఉత్పత్తులను తయారు చేసేందుకు యంత్రాలను అందుబాటులో ఉంచారు.
భౌతికంగా ఒక వస్తువును తయారుచేయాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల అవసరం ఉంటుంది. ఖర్చుతో కూడుకొన్నందున ఔత్సాహికులు వీటిని సమకూర్చుకోవడం చాలా కష్టం. అలాంటి వారికి ఒక వేదికగా టీ- వర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తయారీ రంగానికి అవసరమైన మరో రూ.100 కోట్ల విలువ చేసే యంత్రాలను ప్రభుత్వంతోపాటు కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసి టీ-వర్క్స్ ప్రాంగణంలో అందుబాటులో ఉంచుతున్నారు.
టీ-వర్క్స్‌ను ఆరేళ్ల క్రితమే బేగంపేటలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తెలంగాణవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసే వారిని గుర్తించి, వారికి టీ -వర్క్స్‌లో చోటు కల్పిస్తున్నారు. ప్రస్తుతం టీ-వర్క్స్ ప్రాంగణంలో ఒకేసారి 200 మందికిపైగా ఇన్నోవేటర్లు తమ ఆలోచనలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండే యంత్రాలను అందుబాటులో ఉంచారు. 24 గంటలపాటు 3 షిప్టుల్లో పనులు నిర్వహించుకొనే వీలుంది. సహకారాన్ని అందించేందుకు నిపుణులు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారు.