స్టీల్ ప్లాంట్ విషయంలో కేటీఆర్ రాసిన లేఖ ఏపీ రాజకీయవర్గాల్లోనూ సంచలనం అవుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పోరాటం పేరుతో బీఆర్ఎస్ ఏపీలో అడుగు పెట్టే ప్రయత్నంలో ఉందని.. అందుకే కేటీఆర్ లేఖ రాశారని చెబుతున్నారు. అయితే ఈ లేఖ బీఆర్ఎస్ రహస్య మిత్రులకు ఇబ్బందికరంగా మారింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని వైసీపీ చెబుతోంది. ఆ పార్టీకి పూర్తి స్థాయి ఎంపీల బలముంది. వారెవరూ ఒక్క మాట మాట్లాడటం లేదు. విశాఖ వీధుల్లో గర్జిస్తారు కానీ బయట మాత్రం వారెవరికీ స్టీల్ ప్లాంట్ గుర్తుకు రాలేదు. దీనికి కారణం బీజేపీ ఎక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తుందో అనే.
సీఎం జగన్ బీజేపీకి కోపం రాకుండా ఉండటానికి అసలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పూర్తిగా రాజీ పడిపోయారు. వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తే చాలన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం అలా కాదు. ఆయన కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నా… కేటీఆర్ మాత్రం లేఖలు రాసి రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. ఆయన రాసే లేఖలు నిజంగా కేంద్రానికి వెళ్తాయా లేదా అన్నది ఎవరికీ తెలియదు కానీ మీడియాలో మాత్రం విస్తృత ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు కూడా ఏపీ ప్రభుత్వం వైపు నుంచి చేయడం లేదు.
బీజేపీ కార్పొరేట్ మిత్రుల గురించి కేటీఆర్ ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆ కార్పొరేట్ మిత్రులు అదానీనే. అలాంటి అదానీకే జగన్ అత్యంత సన్నిహితులు. అదానీ సతీసమేతంగా జగన్ ఇంటికి విందులకు వస్తూంటారు. ఈ విషయం కేటీఆర్కు తెలియకుండా ఉంటుందని అనుకోలేం. కానీ ఆయన నేరుగా తమ రహస్య మిత్రుడ్ని… ఏపీ ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సహకరిస్తున్నారని విమర్శించలేదు. కానీ ఈ లేఖ ను విడుదల చేసి… విస్తృత ప్రచారం కల్పించుకుని… ఏపీ ప్రభుత్వం చేతకానిదని నిరూపించేసినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.