రెండు వారాల కిందట కేన్స్ టెక్నాలజీ అనే మల్టీ నేషనల్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ పెద్దల్ని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఇతర నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో తమ పెట్టబడి ప్రణాళికల్లో ఏ మాత్రం కోత విధించడం లేదని స్పష్టం చేశారు. కొంగరకలాన్ లో ఇప్పటికే సిద్ధమైన ఎలక్ట్రానిక్స్ యూనిట్ ను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు.
అయితే తాజాగా ఇదే కేన్స్ టెక్నాలజీస్ గుజరాత్లో సెమీకండక్టర్ పరిశ్రమ పెట్టేందుకు సిద్ధమయింది. కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ తెలంగాణలో పెట్టాల్సిందేనని కాంగ్రెస్ చేతకాని తనం వల్లనే వెళ్లిపోయిందని ప్రచారం చేయం ప్రారంభించారు. కేటీఆర్ కూడా ఓ పేపర్ క్లిప్పింగ్ ను ట్వీట్ చేసి.. కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. తమ గుజరాత్ పెట్టుబడుల ప్రణాళికల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకున్న విషయంలో ఎలాంటి ప్రభావం ఉండదని.. తెలంగాణలో తమ ప్రణాళికలు కొనసాగుతాయని కేన్స్ సంస్థ రెండు వారాల కిందటే స్పష్టత ఇచ్చింది.
సెమీ కండక్టర్ పరిశ్రమకు గుజరాత్ లో కేంద్రీకృతమవుతోంది. అక్కడ ఇప్పటికే నాలుగు పరిశ్రమలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గుజరాత్ లో సెమీకండక్టర్ యూనిట్ తమకు స్ట్రాటజిక్ గా ఎంతో ముఖ్యమని కేన్స్ టెక్నాలజీస్ చెబుతోంది. ఆగస్టు 23న కొంగరకలాన్‌లో ఈఎంఎస్‌ను కేన్స్ సంస్థ ప్రారంభించింది. సెమీకండక్టర్లకు సంబంధించిన అనుబంధ వస్తువులైన సబ్‌స్ట్రేట్, కో-ప్యాకేజ్ ఆప్టిక్స్, లైట్ స్పీడ్ ఫోటోనిక్స్ తదితరవాటిలో కొన్నింటిని కొంగరకలాన్‌లో తయారు చేస్తామని యాజమాన్యం తెలిపింది.
మొత్తంగా తెలంగాణలో పెట్టుబడిని కొనసాగిస్తామని ఆ సంస్థ యాజమాన్యం అధికారికంగా ప్రకటించినా… గుజరాత్ లో ఆ సంస్థ పెట్టుబడి పెట్టడమే .. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని కాంగ్రెస్ ఎలా తిప్పి కొడుతుందో ?