బీఆర్ఎస్ కు అసలు సవాళ్ల రాజకీయం ఏమాత్రం సెట్ కావడం లేదు. ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు సవాళ్ళు విసిరి అప్రతిష్టను మూటగట్టుకుంది బీఆర్ఎస్. ఇటీవల రైతు రుణమాఫీ విషయంలో అత్యుత్సాహంతో సవాల్ విసిరి హరీష్ రావు అభాసుపాలు కావాల్సి వచ్చింది. తాజాగా కేటీఆర్ సీన్ లోకి ఎంటరై సవాల్ చేసినా గత అనుభవాల దృష్ట్యా ఆయన సవాల్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా కేటీఆర్ చేసిన సవాల్ హరీష్ రావును బుక్ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. బ్యాంక్ సంబంధిత సమస్యలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అలా ఆగిపోయిన రైతులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..వారికీ రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో దీనినే అస్త్రంగా చేసుకొని కేటీఆర్ సవాల్ విసిరారు. అయినా, రైతులందరికీ రుణమాఫీ చేసే విషయంలో రేవంత్ పట్టుదలగా ఉండటంతో ఆలస్యమైనా రుణమాఫీ జరిగి తీరుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.
కానీ, సంపూర్ణ రుణమాఫీ జరిగితే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసరడం పట్ల… ఆ పార్టీ సవాల్ విసిరి తోకముడిచిన సందర్భాలను తెరమీదకు తీసుకొచ్చినట్లు అయింది. గతంలో హరీష్ టీడీపీ.. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇస్తే ఆ పార్టీ కార్యాలయంలో అటెండర్ గా పని చేస్తానని సవాల్ విసిరారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చింది. హరీష్ సవాల్ కు కట్టుబడింది లేదు.
ఇప్పుడు కూడా రుణమాఫీ విషయంలో హరీష్ సవాల్ విసిరి వెనక్కి తగ్గారు. ఇప్పుడేమో కేటీఆర్ సంపూర్ణంగా రుణమాఫీ జరిగినట్లు తేలితే రాజీనామాకు సిద్దమని ప్రకటిస్తుండటంతో ఆ పార్టీ ఛాలెంజ్ పాలిటిక్స్ తెలిసిన వారంతా దీనిని లైట్ తీసుకుంటున్నారు.