తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు! ఒకే టీమ్ లో రకరకాల జట్లు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా హైకమాండ్ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఆ ఎత్తుల్లో భాగమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం. ఢిల్లీకి రేవంత్ వెళ్లడం, రాహుల్ గాంధీతో చర్చించడం.. ఇలాంటి కథనాలన్నీ ఈ మధ్య వచ్చాయి. పార్టీ మార్పుపై రేవంత్ ఇంకా స్పష్టత ఇవ్వలేదుగానీ… ఆయన కాంగ్రెస్ లోకి వస్తే మంచిదే అని కొంతమంది సీనియర్లు ఓకే అనేశారు. యువతకు కొత్త జోష్ వస్తుందని చెప్పేశారు. రాహుల్ తో రేవంత్ భేటీ అయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే ఉన్నారు. అంటే, ఆయన నుంచి వ్యతిరేకత లేదు. ఇక, సీనియర్ నేత వీహెచ్ కూడా రేవంత్ రాకపై సానుకూలంగా ఉన్నారు. రేవంత్ ని పార్టీలోకి తేవాలని తెర వెనక ప్రయత్నాలు చేసిన ప్రముఖుల్లో జానారెడ్డి ఉన్నారు! కాబట్టి, సీనియర్ల నుంచి ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం కావడం లేదు. అలాగని రేవంత్ రాకకు అందరూ రెడ్ కార్పొట్లు వేసేస్తున్నారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, అది టి. కాంగ్రెస్ పార్టీ! రేవంత్ చేరికను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. మరి, ఆ అసంతృప్తులు ఎందుకు బయటకి రాలేదంటే.. వారికి గట్టి క్లాస్ పడిందని తెలుస్తోంది.
రేవంత్ రాకపై ఓ ముగ్గురు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయన్ని పార్టీలోకి చేర్చుకుంటే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు రేవంత్ విషయమై తీవ్రంగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై ఆయన వెంటనే స్పందించారానీ, ఫిర్యాదు చేసిన సదరు నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్న సమాచారం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయంగా మారింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ఇచ్చామనీ, అయినా మీరు ఏం సాధించారని కుంతియా వారిని ప్రశ్నించారట. గడచిన మూడున్నరేళ్లలో పార్టీ బలోపేతానికి ఏం చేశారంటూ నిలదీశారట. అధిష్టానం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించొద్దనీ, ఎంతో మేథో మథనం తరువాతే కీలక నిర్ణయాలు ఉంటాయనీ మండిపడ్డట్టు సమాచారం. ఇక, రాహుల్ దగ్గరకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని సదరు నేతలు అనుకున్నా.. పార్టీలో కొత్త రక్తం కావాలని ఆయన ముందే చెప్పేస్తున్నారు! కాబట్టి, ఈ అభ్యంతరాలను ఆయన వినే అవకాశం లేదు.
అందుకే, రేవంత్ విషయంలో ఎవ్వరూ బహిరంగంగా విమర్శలు చేయడం లేదని తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ చేరిక ఖాయమైతే అప్పుడు వీరు నోరువిప్పే అవకాశం ఉంది. అంటే, రేవంత్ రాకతో అద్భుతాలు జరుగుతాయని కాంగ్రెస్ ఆశిస్తున్నా… ఆయన రాకతో అసంతృప్తులు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం అధిష్టానానికి ఇప్పటికే స్పష్టమై ఉంటుంది.