వై నాట్ కుప్పం అంటూ రంకెలు వేసిన వైసీపీ నేతలంతా ఇప్పుడు టీడీపీకి సరెండర్ అయిపోయారు. లొంగిపోయినా వదలి పెట్టరని భావించిన నేతలు పరారీలో ఉన్నారు. మిగిలిన వాళ్లు టీడీపీలో చేరిపోయారు. వద్దనుకున్న వాళ్లను టీడీపీ నేతలు దూరంగా పెట్టారు. పరిస్థితి ఎలా ఉందంటే… కుప్పం వైసీపీ ఆఫీసులో అమరావతి పేరుతో హోటల్ పెట్టేస్తున్నారు.
గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భరత్ అడ్రస్ లేరు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆయన కుప్పం రాలేదు. జగన్ తో పాటు ఢిల్లీ ధర్నాకు వెళ్లారు కానీ.. కుప్పంకు మాత్రం రావడం లేదు. హైదరాబాద్లోనే గడుపుతున్నారు. వైసీపీ హయాంలో కుప్పంలో జరిగిన అనేక అరాచకాలకు భరతే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుపై రాళ్ల దాడితో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులు సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం టీడీపీ విజయం సాధించిన వెంటనే భరత్ కుప్పం నుంచి వెళ్లిపోయారు.
Also Read : మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా : చంద్రబాబు
అండగా ఉంటారని భావించిన క్యాడర్ .. ఆయన కనిపించకపోవడంతో చాలా మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చంద్రబాబుపై బాంబులేస్తామని.. లేపేస్తామని బెదిరించిన కొంత మంది నేతలు కుప్పంలో కనిపించి చాలా కాలం అయింది. ఇలా ముఖ్యనేతలంతా కుప్పం బయట ఆజ్ఞాతంలో ఉండటంతో.. అంతా టీడీపీలో చేరిపోతున్నారు. టీడీపీలో చేరేందుకు కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కూడా సిద్ధమయ్యారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని ఆయనను చేర్చుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆస్పత్రిపైనే కుప్పం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో చేరికల కార్యక్రమం ఆగిపోయింది.
ఇంత కాలం కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని విర్రవీగిన పెద్దిరెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే ఎంట్రీ లేదు. ఆయన కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.