మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నుంచి వచ్చిన ‘కుర్చీని మడతపెట్టి’ పాట ప్రోమోనే పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక మోటు సౌండ్ వున్న బిట్ ని పాటలో కలిపేయడం మహేష్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ప్రోమోనే అలా వుంటే ఇంక పాట ఎలా వుంటుందో అని ఎదురుచూస్తారు. ఇప్పుడా పూర్తి పాట వచ్చింది. అయితే ఈ పాటలో వున్న లిరిక్స్ కి ‘కుర్చీని మడతపెట్టి’ బిట్ కు సింక్ కాలేదనే అనిపిస్తుంది. కేవలం సంచలనం కోసమే ఆ బిట్ యాడ్ చేసి ట్యూన్ తో బ్లెండ్ చేశారనే భావన కలిగింది పూర్తి పాట విన్నాక.
ఇదొక ఐటెం పాటే. రామజోగయ్య శాస్త్రి మాస్ ని ద్రుష్టిలో పెట్టుకునే లిరిక్స్ రాశారు. ‘రాజమండ్రి రాగ మంజరి.. మాయమ్మ పేరు తలనోళ్ళు లేరు మేస్తిరి. కళాకార్ల ఫ్యామిలీ మరి.. నేను గజ్జ కడితే నిదరపోదు నిండురాతిరి” ఇలా సాగింది పల్లవి. అన్నట్టు ఈ పాటలో మహేష్ బాబు కూడా గొంతు చేసుకున్నారు. ‘ఏంది అట్టా చూస్తున్నా.. ఇక్కడ ఎవరి బాధలకి ఆడే లిరిక్ రైటరు.. మడతెట్టి పాడేయండి” అని స్వయంగా మహేష్ బాబు చెప్పడం మాస్ వైబ్ ని ఇంకా పెంచింది. మహేష్ , శ్రీలీల డ్యాన్సులు ఊర మాస్ గా వున్నాయి. ట్యూన్ విషయానికి వస్తే ఊరనాటు. కానీ చరణంలో సడన్ గా అత్తారింటికి దారేది సినిమాలో ‘కాటమరాయుడ’ పాటని గుర్తుకు తెచ్చింది. త్రివిక్రమ్ కి సెంటిమెంట్లు ఎక్కువ. అలాంటి సౌండ్ ఇందులో కోరుకున్నారమో మరి.