తెలుగుదేశం పార్టీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేరికకి రంగం సిద్ధమైపోయింది. కొన్ని రోజులుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది. కోట్ల చేరిక ఏ నియోజకవర్గంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుగుదేశంలోని నాయకులు ఎవరెవరు ఎలాంటి త్యాగాలకి సిద్ధం కావాల్సి వస్తుందన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మారనున్న సమీకరణాలు, జరగనున్న సర్దుబాట్లు అంతిమంగా పార్టీకి లాభం చేకూరుస్తాయి లేక మొదటికే మోసం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది
కేఈ కుటుంబానికి ఇబ్బందులు రాకుండా సర్దుబాట్లు:
కేఈ కృష్ణమూర్తి కుటుంబం , కోట్ల సూర్య ప్రకాష్ కుటుంబాలు కర్నూలు జిల్లా లో దశాబ్దాలుగా రాజకీయ వైరం కలిగిన కుటుంబాలు. ఇప్పుడు కోట్ల తెలుగుదేశం లో చేరనుండడంతో పార్టీకి కీలకమైన, జిల్లాలో బలమైన కేఈ కుటుంబానికి, వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకి ఎలాంటి సమస్య లేకుండా కోట్ల చేరికని పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే కేఈ కుటుంబానికి ఏమాత్రం ఇబ్బందులొచ్చినా వాళ్లు అలకబూనే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి ఎదురైతే కోట్ల చేరికకి అర్థం ఉండదు. అందుకే ఇరు కుటుంబాల్ని సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారట. కోట్ల కుటుంబం వాళ్లకి పట్టున్న డోన్ నియోజకవర్గాన్ని డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే కేఈ కుటుంబం ఆ స్థానాన్ని వదిలిపెట్టడానికి సుముఖంగా లేదు. అందుకే కోట్ల సుజాతని ఆదోని డివిజన్ ఆలూరు నుంచి పోటీకి ఒప్పించనున్నట్టు సమాచారం.
బుట్టా రేణుక కు సర్దుబాట్లు :
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశంలో చేరడం వల్ల బుట్టా రేణుక పరిస్థితి డోలాయమానంలో పడింది.
Click here:
కోట్ల చేరికతో జిల్లావ్యాప్తంగా కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రభావం ఆదోని డివిజన్లో ఉన్న మూడు నియోజవర్గాలపైనే బలంగా ఉండొచ్చని తెలుస్తోంది. అందుకోసం ఆదోని డివిజన్ నుంచే సర్దుబాట్లు చేయడానికి పూనుకున్నట్టు ప్రచారం సాగుతోంది. కోట్ల ఎంపీ సీటుతో పాటు, రెండు అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఇదివరకే బుట్టా రేణుక పేరును ప్రకటించినా, కోట్లనే ఖరారు చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే సర్దుబాట్లు తప్పనిసరి. బుట్టా రేణుకకి ప్రత్యామ్నాయం చూపించి తీరాల్సిందే. కొన్నాళ్లుగా ప్రచారం సాగుతున్నట్టుగానే ఆదోని డివిజన్లోని ఎమ్మిగనూరు నియోజవర్గం నుంచి బుట్టా రేణుకని పోటీ చేయించి, శాసనసభకి పంపబోతున్నారని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. బుట్టా రేణుక కు ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉందన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీ టికెట్టు మీద పోటీ చేసినా ఆమెకు గెలిచే అవకాశాలు బలంగానే ఉన్నాయి. అయితే ఎందుకనో ఆమె ఎంపీగానే పోటీ చేయడానికి పట్టుబడుతోంది. ఇప్పుడు మాత్రం కోట్లకి ఎంపీ సీటు ఇచ్చి బుట్టా రేణుక ను ఎమ్మిగనూరుకు పంపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరి ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి?
ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు బుట్టా రేణుక ఒప్పుకుంటే, ఆమె పోటీ చేయనున్న ఎమ్మిగనూరు నియోజకవర్గాన్నే నమ్ముకుని ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డిని, ఆ పక్కనే ఉన్న మంత్రాలయంకి పంపిస్తారట. ఆయనకి వారి తండ్రి బీవీ మోహన్‌రెడ్డికి ఆ నియోజకవర్గంలోనూ అభిమానులుండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఇదివరకు ఎమ్మిగనూరులో మంత్రాలయం అంతర్భాగంగా ఉండేది. నియోజకర్గాల పునర్విభజన వల్ల అది రెండుగా విడిపోయింది. మంత్రాలయం నుంచి గెలిచొస్తే మంత్రి పదవి ఖాయమని కూడా ఆ యువ నాయకుడిలో చంద్రబాబు ఉత్సాహం నూరిపోసే అవకాశాలున్నాయట.
మరి మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాలని నమ్ముకొన్నవాళ్ల పరిస్థితి?
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మంత్రాలయం లో పోటీ చేస్తే, మంత్రాలయం సీటుని ఆశిస్తున్న నియోజకవర్గ బాధ్యుడు తిక్కారెడ్డికి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఆశపెట్టొచ్చని తెలుస్తోంది. కెఈ కృష్ణమూర్తి కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కోట్ల కుటుంబానికి ఆలూరు టికెట్ ఇస్తే, ఆలూరు నుంచి కోట్ల సతీమణి కోట్ల సుజాత పోటీ చేసే అవకాశాలున్నాయని, ఆ స్థానాన్ని నమ్ముకొన్న తెలుగుదేశం బాధ్యుడు వీరభద్రగౌడ్‌కి కూడా ఏదో ఒక నామినేటెడ్ పదవినే ఆశపెట్టొచ్చని సమాచారం.
మొత్తం మీద:
మొత్తం మీద కోట్ల కుటుంబానికి మాత్రం కర్నూలు పార్లమెంటు, ఆలూరు, కోడుమూరు శాసనసభ స్థానాల్ని అప్పజెప్పడం ఖాయమంగా కనిపిస్తోంది. మరి ఈ సర్దుబాట్లు సజావుగానే సాగుతాయా లేక అసంతృప్తికి, అలకలకి దారితీస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.
– జురాన్ (@CriticZuran)