ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. రామగుండంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… తూ కిత్తా మే కిత్తా అంటూ రాహుల్ మోడీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారనీ, మోడీ కాకపోతే రాహుల్, రాహుల్ కాకపోతే మోడీ వీళ్ల మధ్యనే అధికారం ఉండాలా అని ప్రశ్నించారు? తనకు ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం ఉందనీ… ఈ రెండు జాతీయ పార్టీలకూ సంపూర్ణ మెజారిటీ రాదన్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతున్నాయన్నారు. అందుకే, రాష్ట్రంలోని 16 లోక్ సభ స్థానాలు తెరాస గెలిస్తే… దేశానికి దిశా దిశానిర్దేశం చేసి, తన తెలివితేటలతో మార్పులను తీసుకొస్తా అన్నారు కేసీఆర్.
నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలపై ప్రజలు విముఖం చెందారని కేసీఆర్ చెప్పారు. వీళ్లు పెడుతున్న సభలకు జనం రావడం లేదన్నారు. జనాలకి ఇష్టం లేకపోతే కాళ్లు మొక్కినా రారనీ, మనం ఇలాంటివి ఈ మధ్య చూస్తున్నామని అన్నారు. ఇవాళ్ల రాహుల్ గాంధీ సభ పెడితే నాలుగైదు వేలమంది వచ్చారన్నారు. నరేంద్ర మోడీ ప్రచారానికి వచ్చి, బయట కూర్చున్నారన్నారు. ఎందుకంటే, జనం లేరన్నారు! సభలకు ఎందుకు జనాలు రావడం లేదని వాళ్లు గమనించడం లేదన్నారు కేసీఆర్. వారిపై ప్రజలు విముఖతతో ఉన్నారని ఆయా పార్టీలవారు గుర్తించడం లేదన్నారు. ఈ దేశంలో మార్పు రావాలంటే ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందుకు రావాలనీ, అందుకే తాను ముందుకొచ్చానన్నారు కేసీఆర్.
సభలకు జనాలు రావడం అనే టాపిక్ కేసీఆర్ టచ్ చేయకుండా ఉండాల్సింది! మోడీని, రాహుల్ విమర్శించాలంటే ఆయనకి అందుబాటులో ఉన్న విమర్శనాంశాలు చాలా ఉన్నాయి. కానీ, వారి సభలకు జనం రావడం లేదని ప్రస్థావించడం ద్వారా… తాజాగా జనాలు రాలేదన్న కారణంతో హైదరాబాద్ లో జరగాల్సిన సభను కేసీఆర్ రద్దు చేసుకున్న సందర్భాన్ని ఆయనే గుర్తు చేసినట్టు అయింది. వాస్తవాలు మాట్లాడుకుంటే… నాయకుల సభకు జనాలు రావడానికి, నాయకుల పాపులారిటీకి సంబంధం లేకుండా పోయింది! ఏ స్థాయి నాయకుడి సభలకైనా జనాలు స్వచ్చందంగా వచ్చేవాళ్లు తక్కువ, సమీకరిస్తేనే వస్తున్నారు. ఆ సమీకరణలో ఎక్కడైనా సమన్వయ లోపం ఉంటే ఎలా ఉంటుందో కేసీఆర్ కి తెలుసు! అలాంటప్పుడు, సభలకు జనాలు రాకపోవడమే విముఖత అని వ్యాఖ్యానిస్తే… మరి, ఆయన సభకు కూడా జనాలు రాలేదుగా….అని వెంటనే ఎవరికైనా అనిపిస్తుంది కదా.