తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సర్వే ఫలితాలు తారుమారవడంతో.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మొదటి సారి నోరు విప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయానన్నారు. 15 ఏళ్లుగా సర్వేలు చేయిస్తున్నాం.. మొదటిసారిగా సర్వే తారుమారైందన్నారు. అయితే అదే సమయంలో.. ఆయన ఈవీఎంలు, పోలింగ్ నిర్వహణ తీరుపై విమర్శలు చేసారు.పోలింగ్ శాతం చెప్పడానికి ఈసీకి రెండు రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఈవీఎంలపై చాలా మందికి అనుమానాలు కలిగాయని. వాటిని ఈసీ నివృతి చేయలేదన్నారు. వీవీ ప్యాట్లు లెక్కించమని చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు అడిగినా.. ఈసీ ఒక్క చోట కూడా లెక్కించలేదని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గణనీయంగా ప్రతిపక్షం బలం పెరిగిందని లగడపాటి చెబుతున్నారు. అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో.. ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోవాలి..కానీ అలా జరగలేదన్నారు.
అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ఇప్పటికైనా అనుమానాలను తీర్చడానికి వీవీ ప్యాట్లను లెక్కించాలని లగడపాటి ఎన్నికల కమిషన్ కు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో గణనీయంగా డబ్బు ప్రభావం ఉందని ముందే చెప్పానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మాటకు కట్టుబడి ఉన్నానని.. తను ఏ పార్టీలో చేరబోవడం లేదని లగడపాటి ప్రకటించారు. చాలా మంది నేతలు పార్టీల్లోకి ఆహ్వానించారన్నారు. ఎవరి జోక్యంతోనో..ఎవరి ప్రోద్బలంతోనే నడిచే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తానెప్పుడు దొంగ సర్వేలు చేయలేదు..ఆ అవసరం తనకు లేదని లగడపాటి స్పష్టం చేశారు. ఇక నుంచి తాను చేసే సర్వే ఫలితాలు ఏవైనా పోలింగ్ తర్వాతే వెల్లడిస్తానని… ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. గెలుస్తారని చెప్పిన వాళ్లు ఓడిపోవడం వెనుక కారణాలు తనకు తెలుసని… పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని విషయాలు చెబుతానని లగడపాటి స్పష్టం చేశారు.
మొత్తంగా లగడపాటి రాజపోపాల్ తన సర్వే రిపోర్ట్ కే.. తాను కట్టుబడినట్లుగా చెప్పుకొచ్చారు. ఫలితాలు వేరేగా వచ్చినా.. దానికి వేరే కారణాలున్నాయనట్లుగా మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీలకు అనేక అనుమానాలు ఉన్నాయి. నా సర్వే తప్పయితే తప్పని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా వల్ల ఎక్కడైనా తప్పు జరిగితే క్షమాపణ చెబుతానని కూడా లగడపాటి చెప్పుకొచ్చారు. తెలంగాణ ఫలితాల షాక్ తో లగడపాటి చాలా రోజుల వరకు మీడియాతో మాట్లాడలేదు. ఇప్పుడే.. మొదటి సారిగా.. తన సర్వే గురించి మాట్లాడారు. పోలింగ్ కు ముందు తన సర్వే ఫలితాలను ప్రకటించననే నిర్ణయాన్ని ప్రకటించారు.