సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ జనసేనకు రాజీనామా చేసిన తర్వాత వ్యవసాయం, స్వచ్చంద సంస్థ పనులు చూసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన కాపు నేతలు పెట్టిన సమావేశానికి వెళ్లారు. అప్పుడే… సీబీఐ మాజీ జేడీలోనూ కులం కోణం ఉందన్న విమర్శలు వచ్చాయి.అయితే వాటిని ఆయన పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరింత ముందుకెళ్తున్నారు. ఏపీలో రెండుకులాలే అధికారం చేపడుతున్నాయని బడుగు, బలహీనవర్గాలు రాజ్యాధికారం చేపట్టాలని ఆయన అంటున్నారు.
విజయవాడలో జరిగిన ఏపీ బహుజన ఫ్రంట్ సమావేశానికి వీవీ లక్ష్మినారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన కులాలు.. రాజ్యాధికారం చేపట్టడం గురించి ప్రస్తావించారు. ఈ సమావేశానికి ఆయన హాజరవడమే ఆశ్చర్యం అనుకుటే.. మొత్తం కులపరమైన ప్రసంగం చేయడం మరితం ఆశ్చర్యకరం అనుకోవచ్చు. రాజకీయాల్లో కులాలను తొలగించి చూడలేం కానీ ఇలా నేరుగా నేతలు కులాలకు అఫీషియల్‌గా అఫీలియేట్ అయ్యే ప్రయత్నం చేయడం ఇదే కొత్త ట్రెండ్.
ఉన్నత విద్యావంతతుడు.. కులాలు లేని సమాజం కోరుకుంటారనుకున్న మాజీ జేడీ కూడా ఇప్పుడు అదే బాట పట్టారు. బహుశా ఆయన కాపు కుల నేతలందరూ కలిసి పెట్టబోయే పార్టీలో కీలక పాత్ర పోషించి.. ఇతర కులాలు పెట్టే పార్టీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారేమోనన్న అంచనాలు వస్తున్నాయి. అందుకే.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటున్నారు.