ఏపీకి రాజధాని లేనందున, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలని మరోసారి సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.వెంటనే ఏపీలోని ఏపీలోని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ఇటీవలే ఈ అంశంపై స్పందించిన ఆయన మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
విభజన చట్టంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు కొనసాగుతుందని పేర్కొన్నప్పటికీ హైదరాబాద్ తో ఏపీ ఆ బంధాన్ని ఎప్పుడో తెంపేసుకుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే భావన ఎవరి మదిలోనూ లేదు. ఇప్పుడు ఉన్నదల్లా హైదరరాబాద్ ను మించి ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టాలనే డిమాండ్లు మాత్రమే. కానీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం అందుకు విరుద్దంగా హైదరాబాద్ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.
డిమాండ్ లేవనెత్తుతున్నారు సరే కానీ, ఎందుకు ఆయన ఈ ప్రతిపాదన తీసుకువస్తున్నారో స్పష్టత ఇవ్వకపోవడం పట్ల అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్ ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగినా ఏపీకి కలిగిన అదనపు ప్రయోజనం శూన్యం. రేపు దీనిపై కేంద్రంలో ఏర్పడే సర్కార్ సానుకూలంగా స్పందించిన ఏపీకి ఒనగూరే అదనపు ప్రయోజనం ఏంటో ఆయన చెప్పకపోవడమే రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
లక్ష్మీనారాయణ ఆషామాషీగా ఈ ప్రకటన చేసి ఉండడని .. దీని వెనక బలమైన కారణమే ఉండవచ్చునని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ రీజన్ ఏంటనేది తెలియక అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.