రేటింగ్: 2.5
స్పోర్ట్స్ డ్రామా అనేది ఎప్పుడూ…. మంచి కమర్షియల్ ఎలిమెంటే. ఎందుకంటే ఇప్పట్లో సినిమా చూసేది యూతే. వాళ్లంతా… స్పోర్ట్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతారు. స్పోర్ట్స్ లో.. ఎమోషన్స్ కి ఎక్కువగా చోటుంటుంది. ఓ ఆటగాడి జీవితంలో.. తన గెలుపు ఓటమిలో ప్రేక్షకుడు తనని తాను చూసుకుంటాడు. అందుకే.. స్పోర్ట్స్ డ్రామాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అది నమ్మే.. `లక్ష్య` అనే సినిమా తీశారు. ఇదో ఆర్చరీ కి సంబంధించిన కథ. ఆ ఆటనే జీవితం చేసుకున్న ఓ యువకుడి కథ. మరి… తను గెలిచాడా, ఓడాడా? సినిమాని గెలిపించాడా? లేదా?
పార్థు (నాగశౌర్య) నాన్న ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్ అవుదామనుకుంటాడు. కానీ.. ఓ ప్రమాదంలో మరణిస్తాడు. తన కొడుకు సాధించలేనిది మనవడితో పూర్తి చేయాలని తాతయ్య (సచిన్ ఖేడేడర్కర్) తాపత్రయపడతాడు. మనవడికి ఆర్చరీలో శిక్షణ ఇప్పిస్తాడు. పార్థు కూడా… విలు విద్యలో తన నైపుణ్యం చూపిస్తుంటాడు. కాకపోతే.. ఒకటే బలహీనత. తన తాత కళ్ల ముందు ఉండాల్సిందే. లేదంటే గురి తప్పుతుంది. నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గేనే ముందు… పార్థూకి ఓ ఉపద్రవం ఎదురవుతుంది. గుండెపోటుతో తాతయ్య చనిపోతాడు. దాంతో… ఆటపై దృష్టి కేంద్రీకరించలేకపోతాడు. గురి తప్పుతుంది. తాతయ్య లేని లోటు తీర్చుకోవడానికి డ్రగ్స్‌కి అలవాటు పడతాడు. క్రమంగా దానికి బానిస అవుతాడు. డోప్ టేస్ట్ లో దొరకడం, క్రమశిక్షణ లేకపోవడంతో… స్పోర్ట్స్ అధారిటీ పార్థూని నిషేధిస్తుంది. మరోవైపు తనని ప్రాణంగా ప్రేమించిన రితిక (కేతిక శర్మ) కూడా దూరం అవుతుంది. ఈ దశలో,.. పార్దూ ఏం చేశాడు? మళ్లీ బాణం ఎక్కుపెట్టగలిగాడా, లేదా? వరల్డ్ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడు? అనేది మిగిలిన కథ.
“ఆర్చరీ మన దేశంలో పుట్టిన సంగతి పదిమందిలో తొమ్మిది మందికి కూడా తెలీదు“ అనేది ఓ డైలాగ్. నిజమే.. ఆర్చరీ గురించి చాలామందికి తెలీదు. అలాంటి ఆట గురించి చెప్పాలనుకోవడం, ఆ నేపథ్యంలో ఓ సినిమా తీయడం సాహజమే. ఆర్చరీ లాంటి ఇండివిడ్యువల్ గేమ్స్ నుంచి… ఓ ఎమోషన్ జనరేట్ చేయాలనుకోవడం కత్తిమీద సాము. క్రికెట్ అంటే… ఓ టీమ్ గేమ్. ఒక్కొక్కరికీ ఒక్కో ఎమోషన్ ఉంటుంది. అవన్నీ కథకు ఉపయోగపడతాయి. అందుకే క్రికెట్, కబడ్డీ, హాకీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో… ఎమోషన్స్‌కి ఎక్కువ స్పేస్ ఇవ్వగలం. కానీ.. ఆర్చరీలో అలా జరగదు. అందుకే. ఈ సినిమాలో ఎమోషన్ అంతా పార్దూ అనే పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పైగా ఆర్చరీ గురించి చెప్పడానికి ఏం లేదు. ఆ ఆటని.. సింపుల్ గా అర్థం చేసుకోగలమంతే. లోతుల్లోకి వెళ్లలేం. కాబట్టి.. దర్శకుడు కూడా రిసెర్చ్ జోలికి వెళ్లలేదు. రాబిన్ వుడ్ షాట్.. లాంటి సాంకేతిక పదాలు సామాన్య ప్రేక్షకుడికి అంత ఈజీగా అర్థమవుతాయని అనుకోం.
కథ రేసీ స్పీడులో ఏం మొదలైపోదు. నిదానంగా సాగుతుంది. పార్థూకి ఆటతో ఉన్న అనుబంధం, తాతయ్యపై ఉన్న మమకారం, స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అవ్వడం.. ఇలా.. సీన్లు నిదానంగా సాగుతుంటాయి. లవ్ స్టోరీలో కూడా దమ్ము లేదు. కామెడీకి స్కోప్ లేదు. తాతయ్య మరణం దగ్గర్నుంచి కథ కాస్త కుదురుకుంటుంది. మత్తుమందుకు బానిస అవ్వడం, తెలియకుండా ట్రాప్ లో పడిపోవడం.. ఇదంతా ఆసక్తిగానే సాగుతుంది. అయితే ద్వితీయార్థంలో.. కొత్త పాత్ర (జగపతిబాబు) ప్రవేశిస్తుంది. పార్థూ మళ్లీ మామూలు అవ్వడం, బాణాలు అందుకోలేని స్థాయి నుంచి ఎడమచేత్తో గురి చూసి మరీ కొట్టేంత స్థితికి చేరుకోవడం ఇవన్నీ ఆసక్తికరమైన ఎలిమెంట్సే. కాకపోతే.. అవన్నీ ఫోర్డ్స్ ఎమోషన్స్ లా కనిపిస్తాయి. వరల్డ్ స్పోర్ట్స్ మీట్ చూపించాలనుకున్నప్పుడు… ఆ స్థాయిలో హంగు, ఆర్భాటాలు ఉండాలి. కానీ.. చీప్ గ్రాఫిక్స్‌తో.. వాటిని మమ అనిపించారు. దాంతో రావాల్సిన ఇంపాక్ట్ రాదు. ఓ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ముగుస్తుందో… లక్ష్య కూడా అలానే ముగుస్తుంది.
నాగశౌర్య డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. తొలి సన్నివేశాల్లో… `ఊహలు గుసగుసలాడే`లుక్‌లో కనిపిస్తాడు. క్రమంగా తన లుక్ మారుతూ ఉంటుంది. ఎనిమిది పలకల దేహంతో.. నాగశౌర్య మాసీగా ఉన్నాడు. ఆ లుక్ కోసం తను పడిన కష్టం కనిపిస్తుంది. శౌర్య ఎమోషన్ సీన్స్ బాగా పలికిస్తాడు. ఈ సినిమాలో అది మరోసారి నిరూపితమైంది. కానీ.. తను రొమాన్స్, కామెడీ కూడా బాగానే చేస్తాడు. వాటికి మాత్రం ఛాన్స్ లేకుండా పోయింది. రొమాంటిక్ లో కనిపించిన కేతిక ఈ అమ్మాయేనా అనిపిస్తుంది. రొమాంటిక్ లో చాలా హాట్ గా కనిపించిన కేతిక.. ఈ సినిమాలో సోసో గా ఉంది. జగపతిబాబు కాస్త ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. స్ట్రాంగ్ విలన్ లేకపోవడం ఈ సినిమాకి మరో ప్రధానమైన బలహీనత.
దర్శకుడు ఆర్చరీపై కాస్త రిసెర్చ్ చేశాడు గానీ, పూర్తి స్థాయిలో కాదు. ఇందులో ఉన్నవి రెండే పాటలు. అవి .. సోసోగానే ఉన్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలకు బడ్జెట్ సరిగా పెట్టలేదనిపిస్తుంది. కథంతా ఒకే ఎమోషన్ చుట్టూ సాగడం, ఆ ఎమోషన్ కూడా పార్థూకి అంకితం అయిపోవడం మరో ప్రధాన లోపం. స్పోర్ట్స్ డ్రామాని ఎంచుకున్నప్పుడు ఆ కథ, ఆ ఆట ఎంతమందికి కనెక్ట్ అవుతుంది? అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. ఆర్చరీ కథ కొత్తగా ఉంటుందనుకున్నారు తప్ప.. ఇలాంటి లెక్కలేసుకోలేదు. స్లో ఫేజ్ తో సాగడం, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం ఈ సినిమాకి ప్రధాన ప్రతిబంధాలుగా మారాయి. స్పోర్ట్స్ డ్రామాలంటే ఇష్టమున్నవాళ్లు, కాస్త ఓపిగ్గా సినిమా చూడగలం అనే నమ్మకం ఉన్న వాళ్లు ఓసారి ట్రై చేయొచ్చు.
ఫినిషింగ్ టచ్: గురి తప్పింది
రేటింగ్: 2.5