ఒలిపింక్స్‌లో ఆదివారం భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ పోటీల్లో సెమీస్‌కు చేరిన లక్ష్యసేన్ నిరాశపరిచారు. సెమీఫైనల్లో డెన్మార్క్ ఆటగాడి చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యారు. నిజానికి లక్ష్య సేన్ అద్భుతంగా ప్రారంభించారు. తొలి గేమ్‌లో మూడు గేమ్ పాయింట్లు సాధించినా నిలబెట్టుకోలేకపోయారు. ఆ తర్వాత రెండో సెట్లోనూ జోరు చూపించలేకపోక పోయాడు. అయితే లక్ష్యసేన్‌కు మరో అవకాశం మిగిలి ఉంది. కాంస్య పతకం కోసం మరో సెమీస్‌లో ఓడే ఆటగాడితో పోటీపడవచ్చు.
మరో వైపు భారత హాకీ జట్టు అద్భుతమే చేసింది. బ్రిటన్ తో జరిగిన మ్యాచ్‌లో పది మంది ఆటగాళ్లతోనే అత్యధిక సమయం ఆడినా… విజయం సాధించింది. ఎప్పట్లాగే భారత్ గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుగోడలా నిలిచి గోల్స్ చేయనివ్వలేదు. మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో కూడా శ్రీజేష్ బ్రిటన్ ప్లేయర్ల షాట్లను అడ్డుకున్నారు. భారత ఆటగాళ్లు అన్ని అవకాశాలను గోల్స్ గా మలిచారు. మిగతా క్రీడల్లో పోటీ పడిన వారు పెద్దగా ఫలితాలు సాధించలేదు.
భారత్ ఇప్పటి వరకూ మూడు కాంస్య పతకాలు సాధించి పతకాల పట్టికలో 54వ స్థానంలో ఉంది. పదహారు స్వర్ణాలతో చైనా మొదటి స్థానంలో ఉంది. తర్వాత అమెరికా 14, తర్వాత ఫ్రాన్స్ 12 స్వర్ణాలతో కొనసాగుతున్నారు. అయితే ఇరవై నాలుగు రజత పతకాలతో మొత్తం 61 పతకాలు సాధించి పతకాల పరంగా అమెరికా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇప్పటి వరకూ మొత్తం అమెరికాకు 61 పతకాలు రాగా చైనాకు 37 మాత్రమే వచ్చాయి.