తెలుగుదేశం పార్టీ ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు గవర్నర్ కోటా, నాలుగు ఎమ్మెల్సీ కోటా, ఒకటి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడుకు కొనసాగింపు ఇచ్చారు. యనమలకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో మరో ముగ్గురు అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పేర్లను ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో శివనాథ్ రెడ్డి, శమంతకమణి పేర్లను ఖరారు చేశారు. విశాఖ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా బుద్ధా నాగజగదీశ్వర్రావు పేరును ఖరారు చేశారు. ఈ అభ్యర్థులంతా గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలను చూసుకున్న చంద్రబాబు .. బీసీలకు నాలుగు సీట్లు కేటాయించారు. ఎస్సీ సామాజికవర్గానికి ఒక చోట అవకాశం కల్పించారు. టిక్కెట్ల సమీకరణాలను కూడా.. చంద్రబాబు ఎమ్మెల్సీ పదవుల పంపకం విషయం లో చూసుకున్నారు. బీటీ నాయుడు.. కర్నూలుకు చెందిన నేత. ఆయన గత ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి టిక్కెట్ కేటాయించే పరిస్థితి లేదు. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. అందుకే.. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి సర్దుబాటు చేశారు. ఎమ్మెల్సీ శమంతకమణికి కొనసాగింపు ఇవ్వడం వెనుక.. ఆమె నియోజకవర్గం శింగనమల రాజకీయం ఇమిడి ఉందని చెబుతున్నారు. అక్కడ శమంతకమణి కుమార్తె యామినిబాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సారి అక్కడ.. కాంగ్రెస్ నేత శైలజానాథ్ .. టీడీపీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే యామినిబాలకు కొనసాగింపు ఇచ్చారని చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల నేత.. అశోక్ బాబుకు.. మొదటి నుంచి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయాల కోసమే ఆయన కొంచెం ముందుగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు ఇచ్చిన మాటను కూడా చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఇక జమ్మలమడుగు పంచాయతీని తీర్చే ఫార్ములాలో భాగంగా.. ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయడంతో.. ఆ స్థానాన్ని ఆదినారాయరెడ్డి సోదరుడి కుమారుడు శివనాథ్ రెడ్డికి ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవుల భర్తీలో.. వైసీపీ టార్గెట్ చేస్తున్న సామాజికవర్గాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు.