తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల్ని మార్చాలని బీజేపీ హైకమాండ్ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణను ఈ నెలలో చేయబోతున్నారని… అందులో బండిసంజయ్ కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఇప్పటికే ముసలం ప్రారంభమయింది. బండి సంజయ్ ఏకపక్ష వైఖరి ఇతర కారణాల వల్ల బీజేపీ కి వచ్చిన హైప్ అంతా చల్లబడిపోయి మైనస్ లోకి వెళ్లిపోయిందన్న భావనలో హైకమాండ్ వచ్చిందని చెబుతున్నారు.
అదే సమయంలో బండి సంజయ్ ను మార్చకపోతే కట్టకట్టుకుని తాము అంతా కాంగ్రెస్ లో చేరిపోతామని ఇప్పటికి పార్టీలో చేరిన వారంతా అల్టిమేటం జారీ చేశారు. ఈటల రాజేందర్ ను పదే పదే ఢిల్లీ పిలిపించుకుంటున్న బీజేపీ హైకమాండ్ ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. బీజేపీని వైసీబీకి బీ టీమ్ గా మార్చేశారన్న ముద్రపడిన సోము వీర్రాజును కూడా వదిలించుకోవాలని డిైసడయినట్లుగా చెబుతున్నారు. అయితే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవని.. ఆయనకు అంత స్థాయి లేదని చెబుతున్నారు.
నిజానికి నిన్నామొన్నటి వరకూ బండి సంజయ్, సోము వీర్రాజులను మార్చే అవకాశం లేదని .. వారి నేతృత్వంలోనే ఎన్నికలు జరుగుతాయని ప్రకటనలు చేశారు. కానీ హఠాత్తుగా మారిన రాజకీయాలతో వారి పదవులకు గండం ఏర్పడింది. బండిసంజయ్ ను తప్పిస్తే ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సోము వీర్రాజును తప్పిస్తే ఎవరికి చాన్సిస్తారన్నది మాత్రం క్లారిటీ లేదు. జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ రేసులో ముందున్నారని చెబుతున్నారు.