ఐదేళ్లు రాచి రంపాన పెట్టి.. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు రోజు రాత్రి చెల్లని జీవోలతో గిలిగింతలు పెట్టేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నిన్నటి నుంచి జీవోల మీద జీవోలు ఇచ్చేస్తున్నారు. విచిత్రంగా ఆ జీవోలను ఎప్పట్లా రహస్యంగా ఉంచడం లేదు.. అడిగిన వారికీ .. అడగని వారికీ పంపుతున్నారు. ప్రభుత్వ జీవోలు చూసి… చాలా మంది అవునా… ఇలా కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.
ఉద్యోగులకు రెండు డీఏలు ఇస్తూ అర్థరాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. కామెడీ ఏమిటంటే ఆ డీఏలు అమలు చేసి కొత్త ప్రభుత్వమే. ఒక వేళ జగనే వస్తే ఈ జీవోలను ఉపసంహరించుకోరని గ్యారంటీ లేదు. ఎందుకంటే వాటి చెల్లుబాటుపై సందేహాలు ఉన్నాయి. ఇలా జీవోలు లెక్కలేనన్ని ఉన్నాయి. అంగన్ వాడీ టీచర్లు, ఆయాలపై ఎంత కర్కశం చూపారో కళ్ల ముందే ఉంది. ఇప్పుడు వారి డిమాండ్లపై సబ్ కమిటీ వేశారట. కోడ్ వచ్చాక ఆ సబ్ కమిటీ ఏం చేస్తుంది. మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు వారిపై ఉక్కుపాదం మోపారు. కేసులు పెట్టారు. ఇప్పుడా కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇలాంటి గిలిగింతలు పెట్టే ఉత్తర్వులు చూసిన వారికి ఇంత కాలం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదన్నప్రశ్న వస్తుంది. ముందుగా అలాంటి ఉత్తర్వులు ఇస్తే అమలు చేయాలి…. కోడ్ వచ్చే ముందు ఇస్తే పక్కన పడేయవచ్చు. ఈ మాత్రం చచ్చు తెలివి తేటలు ఉండబట్టే… ఐదేళ్లు పరిపాలన చేశారు. ఎవరైనా నమ్మి పొరబాటున ఓటేస్తే… పాతాళానికి దగ్గర దారి చూపిస్తారు.