చంద్రబాబుపై లెక్కకు మిక్కిలిగా కేసులు పెట్టారు. వాటిపై దాఖలైన పిటిషన్లపై వాదనలు వినిపించడానికి మాత్రం లాయర్లకు సమయం చిక్కడం లేదు. అదే పనిగా వాయిదాలు కోరుతూ పోతున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు అయినా.. మరో పిటిషన్లు అయినా ఇదే పద్దతి. ఏజీ గారు మరో కేసులో బిజీగా ఉన్నారని చెప్పి ఇవాళ జరగాల్సిన రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేయించుకున్నారు. ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు చివరి సారి కాదు. గత రెండ నెలలుగా వివిధ కారణాలతో పిటిషన్లపై వాయిదాల మీద వాయిదాలు కోరుతూనే ఉన్నారు.
కోర్టులో న్యాయమూర్తి ముందు ఉంచడానికి ప్రభుత్వం దగ్గర.. ప్రభుత్వ లాయర్ల దగ్గర సరుకు లేదు. అందుకే వీలైనంత కాలం సాగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్వాష్ పిటిషన్ పై చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని అప్పుడు విచారణ కూడా అవసరం లేదని వాదనలకు సమయం వృధా చేసుకోవడం ఎందుకన్నట్లుగా ఏజీ, ఏఏజీ వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందా లేదా అన్నదానిపై తీర్పు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ వారం లేదా వచ్చే వారం తీర్ప వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు పిటిషన్ల విచారణ ముందుకు సాగడం లేదు.
చంద్రబాబుపై కేసుల వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైనే ఆధారపడి ఉంది. అది చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఆయనను జైల్లో నిర్బంధించడం కూడా అక్రమం అని స్పష్టమైనట్లే. ఇది సీఐడీ వ్యవస్థలకు తలవంపులు తెస్తుంది. ఇప్పటికే సీఐడీ నిర్వాకాలపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని చెబితే.. దేశం మొత్తం రాజకీయ కక్ష సాధింపుల్లో సరికొత్త పరిణామాలు నమోదయ్యే అవకాశం ఉంది.