పార్టీ నుంచి పోవడమే కానీ.. వచ్చి చేరేవారు లేక… కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా డీలా పడిపోయింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీలో చేరికలకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో ఎవరైనా చేరాలంటే… ముందుగా కాంగ్రెస్ నేతలే బతిమాలుకునేవాళ్లు. వాళ్లు పెట్టే డిమాండ్లకు అంగీకరించి పార్టీలో చేర్చుకునేవారు. కానీ ఇప్పుడు చాలా మంది వస్తామని.. కబురు చేస్తున్నారు వారిలో చాలా మంది టిక్కెట్ హామీ కోరుతున్నప్పటికీ… పరిస్థితిని బట్టి సర్దుకుపోవడానికి కూడా రెడీ అవుతున్నారు.
ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోచేరడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన గతంలో రేవంత్ రెడ్డిని ఓడించడానికి కొడంగల్ పై దృష్టి పెట్టి.. తన సీట్లో ఓడిపోయారు. కొడంగల్లో తమ్ముడ్ని గెలిపించుకున్నారు. అదే మైనస్ అయింది. అక్కడ్నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ ఆయనకే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో పట్నంకు పార్టీ మారక తప్పడం లేదు.
బీఆర్ఎస్ లో టిక్కెట్ చాన్స్ లేని బలమైన నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ… వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాహుల్ సమక్షంలో భారీగా చేరికలకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. మల్లు భట్టి రవి నేతృత్వంలో ఓ కమిటీని రేవంత్ నియమించారు. ఈ కమిటీ.. చేరే వారి జాబితాను రెడీ చేస్తోంది. చాలా రోజులుగా పార్టీ నుంచి పోతున్న వాళ్లే కానీ.. వస్తామని చెప్పి మరీ… బతిమాలుకుటున్న పరిస్థితి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.