త్వరలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ పాదయాత్ర పెట్టుకున్నారు. పాదయాత్రకు వెళ్తున్నారు కాబట్టి, కేసుల విచారణకు హాజరు నుంచి మినహాయింపు కోరితే.. కోర్టు కుదరదని చెప్పేసింది. దీంతో వైకాపాలో చర్చ మొదలైంది. శీతాకాల సమావేశాలతోపాటు జగన్ పాదయాత్రకు సంబంధించిన కీలకాంశాలపై వైసీపీఎల్పీ భేటీ అయింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైకాపా నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే బాగుంటుంది అంటూ పలువురు నేతలను ప్రతిపక్ష నేత జగన్ సలహాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అధికార పార్టీని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలనే వ్యూహంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకోవడంపైనే పోరాటం చేయాలని వైకాపా నిర్ణయించినట్టు సమాచారం. జంప్ జిలానీలతో రాజీనామాలు చేయిస్తే తప్ప, తాము అసెంబ్లీలో కూర్చునేది లేదని వైకాపా ఎమ్మెల్యేలు పట్టుబట్టే ఆస్కారం ఉందని తెలుస్తోంది. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకూ సమావేశాలను బహిష్కరించాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెబుతున్నారు!
నిజానికి, ఈ శీతాకాల సమావేశాలు ప్రతిపక్షానికి కాస్త ఇబ్బందికరమైనవే కాబోతున్నాయి. ఎందుకంటే, నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ విజయం నేపథ్యంలో టీడీపీలో కాస్త జోష్ పెరిగింది. పైగా, జగన్ పాదయాత్రను మరోసారి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నట్టుగా ఉంది. కేసుల విచారణకు హాజరు కావాలని కోర్టు కూడా స్పష్టంగా చెప్పేసింది. దీంతో ఈ సమావేశాలు హాట్ హాట్ గానే ఉంటాయి. ఈ నేపథ్యంలో ‘ఫిరాయింపు నేతలతో రాజీనామాలు’ పేరుతో సమావేశాలను బహిష్కరించడం సరైన వ్యూహం కాదు. ఇది పలాయన వాదమే అవుతుంది. వాస్తవానికి జగన్ పాదయాత్ర సమయంలో అసెంబ్లీ సమావేశాలుంటాయి. గుండుగుత్తంగా బహిష్కరించేస్తే అదో సమస్య తీరిపోతుంది అన్నట్టుగా వైకాపా వైఖరి కనిపిస్తోంది.
ఎలాగూ జనంలో జగన్ ఉంటారు కాబట్టి, తాము కూడా ఆయనకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆ కారణంతో సమావేశాలకు హాజరు కాకపోతే బాగోదు కాబట్టి, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు మిషతో సమావేశాలను బహిష్కరించేందుకు సిద్ధపడుతూ ఉన్నారు! ఫిరాయింపు నేతల అంశాన్ని పెద్దది చేయడం ద్వారా… అధికార పార్టీ మాటల దాడిలో కొంత తగ్గే అవకాశం ఉంటుందన్నది వారి అంచనాగా కనిపిస్తోంది. సమావేశాల బహిష్కరణపై తుది నిర్ణయం మరో రెండ్రోజుల్లో ప్రకటించబోతున్నారు. ఏదైమనా, ఇది కచ్చితంగా పలాయన వాదమే అవుతుంది. పార్టీ అవసరాల కోసం అసెంబ్లీ సమావేశాలను పక్కపెడుతున్నట్టే కనిపిస్తోంది. ఫిరాయింపు నేతలపై చర్యలపై విషయమై పోరాటాలు చేయాలనుకుంటే ఇప్పుడు కూడా చెయ్యొచ్చు. దానికి అసెంబ్లీ సమావేశాలు వచ్చేవరకూ వేచి చూడాల్సిన అవసరం ఏముంటుంది..?