టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో… వైసీపీ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇదే కేసులో అరెస్ట్ భయంతో హైదరాబాద్ లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఉదయం పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదే కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్, తలశిల రఘురాంల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 12 బృందాలు హైదరాబాద్, విజయవాడ, పల్నాడు, గుంటూరు ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. అరెస్ట్ భయంతో వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక ఉదయం అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని కూడా కాసేపట్లో పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
అయితే, మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడున్నారు…? అన్న అంశంపై పోలీసుల వేట కొనసాగుతోంది. ఆయన్ను కూడా ఒకట్రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.