జగన్మోహన్ రెడ్డి జుత్తు కేసీఆర్, మోడీ చేతుల్లో ఉందని విమర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రిపైగానీ, ప్రధానిపైగానీ జగన్ ఎప్పుడైనా విమర్శలు చేశారా అని ప్రశ్నించారు. జగన్ శాశ్వతంగా లోటస్ పాండ్ లో ఉండిపోయి, కేసీఆర్ కేబినెట్ లో మంత్రి అయిపోయి హైదరాబాద్ లోనే ఆనందంగా ఉంటే మనకే సమస్యలేదని ఎద్దేవా చేశారు. ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి ఈ గడ్డకోసం పనిచేసే పరిస్థితి ఉండాలన్నారు. సీబీఐ 12 ఛార్జిషీట్లు వేస్తే అన్నింటిలోనూ జగన్ ఎ1 ముద్దాయి అన్నారు. అందుకే ఆయన నరేంద్ర మోడీకి లొంగిపోయారన్నారు. చీపురుపల్లి నుంచి పోటీచేస్తున్న బొత్సపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.
చీపురుపల్లి టీడీపీలో అసంత్రుప్త నేతలున్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో టిక్కెట్టు ఆశిస్తున్న కె. త్రిమూర్తుల రాజు రెబెల్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమౌతున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. సామాజిక వర్గ సమీకరణల ప్రకారం ఈసారి టీడీపీ టిక్కెట్ ను కిమిడి నాగార్జునకు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు ఈయన. దీంతో, టీడీపీ రెండు వర్గాలుగా చీలుతుందనే పరిస్థితి వచ్చింది. బొత్స గెలుపునకు ఇది అనువైన పరిస్థితిగా మారుతుందనే విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్రిమూర్తుల రాజుకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. పోయిన ఎన్నికల్లో ఆయనకి సీటు ఇవ్వలేకపోయామనీ, ఇప్పుడు కూడా నాగార్జునకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరమనీ, ఎక్కడైనా నాయకులకు అన్యాయం జరిగిదే దాన్ని సరిచేసే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా తనది అన్నారు. భేదాభిప్రాయాలు మరచిపోవాలనీ, ప్రజలు ఆశీస్సులు ఇస్తున్నారనీ, అందరికీ న్యాయం చేస్తానంటూ చెప్పారు. త్రిమూర్తులకు న్యాయం చేసే బాధ్యత తనదని ఒకటికి రెండుసార్లు చెప్పారు చంద్రబాబు.
టిక్కెట్ దక్కలేదన్న అసంతృప్తితో రెబెల్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమౌతున్న త్రిమూర్తులు.. ఇప్పుడు వెనక్కి తగ్గుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. స్థానికంగా టీడీపీ గ్రూపుల వల్ల వైకాపా అభ్యర్థి బొత్స స్థానికంగా కొంత బలంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన గెలుపు ఖాయమనే ధీమాతో స్థానిక వైకాపా కార్యకర్తలూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీలోని అసంతృప్తి వర్గాన్ని బుజ్జగించారు చంద్రబాబు! అంతేకాదు, సీనియర్ నేత గద్దె బాబురావుతోపాటు, ఇతర నాయకులందరినీ ఒకే వేదిక మీదికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఉన్న అసంతృప్తుల్ని ఈ నాయకులంతా పక్కనపెడతారా లేదా అనేది చూడాలి.