ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు వెళ్లాయి. ఈ నోటీసుల సారాంశం ..ఆయన ప్రెస్మీట్లో చెప్పిన వాటికి ఆధారాలు ఇవ్వాలని అడగడం. రఘురామ రోజువారీ ప్రెస్మీట్లలో భాగంగా రెండు రోజుల కిందట మద్యం అంశంపై మాట్లాడారు.ఏ రాష్ట్రంలోనూ లభించని పనికిమాలిన కల్తీ బ్రాండ్ల మద్యం ఏపీలోనే అమ్ముతున్నారని.. మద్యం నమూనాలను పరీక్షిస్తే, మనుషులు తాగడంవల్ల ప్రమాదకరమని తేలిందని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్లోని ఎస్జీఎస్ కంపెనీలో మద్యం నమూనాలను పరీక్ష చేయించామని… వొల్కనిన్, పైరోగాలో, స్కోపరోన్ అనే ప్రమాదకరమైన పదార్థాలను ఆ మద్యంలో కనుగొన్నారని ఆయన కొన్ని నివేదికలు ప్రదర్శించారు.కల్తీ మద్యం అమ్మకాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు . రఘురామ ఏ ఆరోపణలనూ ఇంత వరకూ ఏ శాఖ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఏపీబీసీఎల్ మాత్రం ఉలిక్కి పడింది.వెంటనే.. ఆ నివేదిక ఇవ్వాలంటూ రఘురామకృష్ణరాజుకు సమాచారం పంపింది.
ఏపీబీసీఎల్ ఆ నివేదిక ఖచ్చితత్వాన్ని నిర్దారించుకునేందుకు అడిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ ఎస్జీఎస్ సంస్థ విషయంలో ఏమి తేడాలు ఉన్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘురామపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ముందు రఘురామ చేసే ఆరోపణలన్నింటికీ ప్రభుత్వ శాఖలు ఇలానే స్పందిస్తాయేమో చూడాలి !