ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని.. వైసీపీ చేస్తున్న హడావుడికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయింది. వ్యూహాత్మకంగా వచ్చే వారం నుంచి రోజూ.. చేరికల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలోకి వస్తామని చెబుతున్న వారికి తలుపులు తెరవాలని నిర్ణయం టీడీపీలోకి కోట్ల , సబ్బం , కొణతాల రామకృష్ణ, కిషోర్ చంద్రదేవ్ లతో పాటు మరికొందరు నేతలు రానున్నారు. వీరందరూ ఇప్పటికే.. హైకమాండ్‌తో చర్చలు జరిపారు. ఎన్నికలకు ముందు వలసలు, ఆరోపణలు సహజంగానే ఏ పార్టీ కార్యకర్తలనైనా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. టీడీపీ నేతల వలసలతో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా.. వెంటనే విరుగుడు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, కిషోర్ లతో పాటు మరికొందరు నేతల్ని టీడీపీలో చేర్చుకునేందుకు తేదీల్ని ఖరారు చేస్తున్నారు. వీరిని ఎక్కడ సర్ధుబాటు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి లెక్కలు వేస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. ఈ సమీక్షల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి, పోటీ చేయబోయే అభ్యర్ధుల జాతకాలు, ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరు పోటీ చేయాలనే అంశంపై కూడా కసరత్తు జరుగుతుంది. పార్టీలోకి వచ్చే వారిని ఎలా వాడుకోవాలనేది కూడా నేతల అభాప్రాయాన్ని చంద్రబాబు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలఖారుకు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు.
కొన్ని నియోజకవర్గాలలో ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్దులను తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని తీసుకురావాలని సియం భావిస్తున్నప్పటికీ..తొలగించే అభ్యర్దులకు సర్ధిచెప్పేందుకు కూడా సియం నిర్ణయించారు. కొత్త వారిని తీసుకోవడాన్ని గురువారం నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. పధకాల వలన వచ్చిన సానుకూల వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రచారం పెద్ద ఎత్తున ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పధకానికి కూడా కోడ్ అడ్డురాకుండా ముందుగానే వెయ్యి రూపాయలను రైతుల బ్యాంక్ అకౌంట్ లలో వేశారు. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ, పెన్షన్ల పెంపు వంటి అంశాలను విస్త్రతంగా ప్రచారం చేయబోతున్నారు. ఓ వైపు… నేతలంతా .. తమ పార్టీలో చేరుతున్నారనే ప్రచారంతో పాటు… సంక్షేమ పథకాల ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు.