లోక్ సభలో చారిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది. ఇది మహిళల విజయమనీ, ట్రిపుల్ తలాక్ బిల్లుతో సోదరీమణులకు విముక్తి లభిస్తుందని భాజపా సర్కారు అంటోంది. ఈ బిల్లుకు సభ ఆమోదం లభించడం చాలా సంతోషంగా ఉందనీ, ఇది మహిళల విజయమనీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ అంశమై లోక్ సభ అంతా ఏకాభిప్రాయం వ్యక్తం కావడం విశేషమన్నారు. కొంతమంది దీన్ని వ్యతిరేకించారు అన్నారు. అయితే, ఇది ధర్మానికి సంబంధించో, లేదా ఆధ్యాత్మికతకు సంబంధించినదో కాదని మొదట్నుంచీ చెబుతున్నామనీ, ఈ అంశంలో చూడాల్సింది కేవలం మహిళలకు జరగాల్సిన న్యాయం మాత్రమే అన్నారు. ఇది మహిళల విజయమని ఆయన అభివర్ణించారు.
అయితే, ఈ బిల్లుకి రాజ్యసభలో కూడా ఇదే స్థాయి మద్దతు లభిస్తుందా.. అంటే, అనుమానమే! ఎందుకంటే, లోక్ సభలో ఎన్డీయేకి పరిపూర్ణ మెజారిటీ ఉండటంతో, అన్ని మిత్ర పక్షాలు విప్ జారీ చేసి మరీ సభ్యులందరూ సభకు హాజరయ్యేట్టుగా చేసుకున్నాయి. ఈ బిల్లులోని కొన్ని అంశాలు మార్చాలంటూ సభలో అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా పట్టుబట్టారు. ఇలాంటి నిర్ణయం తీసుకునేముందు.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును ఎందుకు సంప్రదించలేదన్నారు. అయితే, ఇదే పాయింట్ పై భాజపా రాజ్యసభ సభ్యుడు ఎం.జె. అక్బర్ స్పందిస్తూ.. పర్సనల్ లా బోర్డును సంప్రదించాల్సిన అవసరం లేదనీ, ఆ బోర్డు ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఎవరు చెప్పాంటూ అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకే కూడా ఈ బిల్లును వినిపించింది. ఈ బిల్లు రాజ్యసభకు వస్తే వ్యతిరేకిస్తామని ఆ పార్టీ చెబుతోంది. బీజేడీ కూడా ఇదే బాటలో మాట్లాడింది. ఇప్పుడున్న ఫార్మాట్ లో కొన్ని మార్పులు చేయాలంటూ కాంగ్రెస్ కూడా అంటోంది. ట్రిపుల్ తలాక్ బిల్లులో మూడేళ్ల జైలు శిక్ష అంశాన్ని కొందరు కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నారు. తలాక్ చెప్పిన వ్యక్తి జైలు పాలైతే.. అలాంటివారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేత ఖురేషీ వంటివారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి, ఈ బిల్లుపై ప్రతిపక్షాలతోపాటు తటస్థంగా ఉంటూ వచ్చిన పార్టీలు కూడా కొంత వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. మార్పులూ చేర్పులూ కోరుతున్నాయి. లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో దీనికి ఆటంకం ఏర్పడే పరిస్థితే కనిపిస్తోంది. అదే జరిగితే సవరణల కోసం స్టాండింగ్ కమిటీకి పంపించడం, ఆ తరువాత మరోసారి లోక్ సభలోకి బిల్లు తిరిగి రావొచ్చు. ఏదేమైనా, ఈ బిల్లుపై కొన్నాళ్లపాటు చర్చోపచర్చలకు ఆస్కారం స్పష్టంగా ఉంది.