హెడ్ అంటే హెడ్డాపీసరు కాదు గాని ఒక ప్రముఖ తెలుగు ఛానల్‌కు ఆలోచనలు అందించి ఆదేశాలు జారీ చేసే పాత్ర మాత్రం మంత్రి లోకేశ్ గత కొద్ది కాలంగా చురుగ్గా నిర్వహిస్తున్నారట. నిజానికి ఆ ఛానల్ ఆయనే కొనేశారని వదంతలు రావడానికి ఈ పరిస్థితి కారణమైంది. అయితే ఆ యజమాని స్వభావం తెలిసిన వారెవరూ ఆయన అంత సులభంగా యాజమాన్యం ఇచ్చేసి బంగారుబాతును వదులుకుంటాడని అనుకోరు. . అయితే తర్వాత విచారిస్తే తెలిసిందేమంటే ప్రభుత్వం తరపున భారీగా అంటే దాదాపు వంద కోట్లు వివిధ సేవల కింద పొందుతున్న సదరు ఛానల్ నిత్య నిర్వహణలో కూడా రాజకీయంగా ఏ కోణం తీసుకోవాలనేదానిపై లోకేశ్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారట. అందరికీ కాకున్నా తనకు సన్నిహితులైన వారికి ఫలానా విధంగా చేయండని సూచనలు చేస్తున్నారట. నిజానికి ఆయన కన్నాముందే ఆ ఛానల్ చంద్రబాబు ప్రభుత్వ రక్షణకోసం కౌంటర్ స్టోరీలు వేస్తూనే వుంటుంది. ఇప్పుడు దాని రేటింగ్ కూడా బాగా పెరిగింది. తమాషా ఏమంటే ఎపిలో చంద్రబాబుకు అందించే సేవలే కాస్త అటూ ఇటూగా కెసిఆర్‌కు లభిస్తుంటాయి. వైసీపీ లేదా వామపక్షాల వార్తలు ఎట్టి పరిస్థితుల్లో ప్రముఖంగా ఇవ్వరాదనే సూత్రం అనధికారికంగా అమలై పోతుంటుంది. ఇంతకీ అదే చానల్ అంటారా? కాస్త హెడ్‌తో ఆలోచించండి- మీకే ‘వెలుగు’తుంది!