కుప్పం బహిరంగసభలో లోకేష్ చాలా విషయాలు మాట్లాడారు. రాజకీయంగా కొన్ని విమర్శలకు గీత దాటకుండా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంలో పాదయాత్రకు అనుమతులు.. ఇతర అంశాలపై మాట్లాడినప్పుడు .. పవన్ వారాహి యాత్ర గురించి కూడా చెప్పారు. అడ్డుకుంటే తొక్కుకుంటూ వస్తామన్నారు. ఈ అంశం అటు టీడీపీ అటు జనసేన నేతల్లోనూ చర్చనీయాంశమయింది. జనసేనతో పొత్తు విషయం తేలకుండా ఇలా మద్దతుగా మాట్లాడటం మంచిది కాదేమోనని టీడీపీ నేతలు కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన నేతలు… పవన్ కల్యాణ్ ను రుద్దుతున్నారని అనుకుంటున్నారు.
నిజానికి టీడీపీకి పవన్ కల్యాణ్ దూరం జరిగినప్పుడు… లోకేష్ నే టార్గెట్ చేసుకున్నారు. లోకేష్ పై అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. శేఖర్ రెడ్డి అనే చెన్నై వ్యాపారిని లోకేష్ బినామీగా పవన్ విమర్శించారు. తర్వాత ఎలా అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరూ అనుకుంటున్నారని కవర్ చేశారు. ఇలా అధారాలు లేకుండా పవన్ . లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాదు.. శ్రీరెడ్డి అనే మహిళామణి … పవన్ పై చేసిన తిట్ల దండం లోకేష్ చేయించారని కూడా పవన్ ఆరోపించారు. నిజానికి అదంతా వైసీపీ ట్రాప్ అని తర్వాత తేలింది.
తనపై ఇన్ని నిందలేసినా పవన్ ను లోకేష్ ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత కూడా టార్గెట్ చేయలేదు. ఇప్పుడు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇప్పడు లోకేష్ మద్దతుగా మాట్లాడుతున్న అంశం గుర్తుకు వస్తే పవన్ అప్పట్లో తాను చేసిన ఆరోపణలు కూడా గుర్తుకు వస్తాయి. అయితే తానేమీ మనుసులో పెట్టుకోలేదని.. రాజకీయ ఆరోపణలుగానే చూస్తున్నానని.. కలిసి పని చేయడానికి సిద్ధమని.. లోకేష్… ఈ వారాహికి మద్దతు ద్వారా.. పవన్ కు సంకేతం పంపారని అనుకోవచ్చంటున్నారు.