వెయ్యి SFTలో అపార్టుమెంట్ ఉంటే మధ్య తరగతికి పండగే. దానిపై ఈఎంఐలు చెల్లించుకోవడానికి జీవితం వెచ్చిస్తారు. కానీ కాస్త నయా సంపాదన పరులు మాత్రం… అంతకు మించి ఆలోచిస్తున్నారు. అపార్టుమెంట్లకే రూ. 30 కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. అంత పెడుతున్నారంటే ఆ స్థాయి సౌకర్యాలు ఉంటాయని అర్థం.
హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వైపు వెళ్తే ఎటు చూసినా హైరైజ్ అపార్టుమెంట్లు కనిపిస్తాయి. ఇవి మెల్లగా నగరం నలుమూలకు విస్తరిస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఈ హైరైజ్ అపార్టుమెంట్ మెంట్లు ఇండిపెండెంట్ హౌస్కు ఏ మాత్రం తీసిపోవు. పైగా ఫుల్ సెక్యూరిటీ. అందుకే ఖర్చు ఎంత అని ఆలోచించకుండా కొనుగోలు దారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బిల్డర్లు కూడా… ఒక్కో ఫ్లాట్ ఖరీదు 30 కోట్ల వరకూ తీసుకెళ్లిపోతున్నారు.
బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు అల్ట్రా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలను ప్రయారిటీగా తీసుకుని నిర్మిస్తునన్నారు. ఒక్కో ఫ్లాట్ 5వేల నుంచి 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటున్నాయి. పదిహేను వేల అడుగులంటే చిన్న విషయం కాదు. మధ్యతరగతి వ్యక్తి కొనుక్కునే ప్లాట్లు పదిహేను కలిపితే వచ్చేంత స్పేస్. అందులో ఎంత లగ్జరీగా ఇల్లు డిజైన్ చేసుకోవచ్చో చెప్పాల్సిన అవసరం లేదు. సౌకర్యాలను బట్టి ఒక్కో ప్లాట్ ధర రూ.6 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఉంటోంది.
Also Read : వరంగల్ మరో హైదరాబాద్ !
ఐటీ హబ్ పరిసర ప్రాంతాల్లో అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టులను భారీగా నిర్మిస్తున్నారు. 20వరకు అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి ఎకరం 100 కోట్లు పలికిన కోకాపేటలో అధికంగా ఈ తరహా అపార్ట్ మెంట్స్ నిర్మిస్తున్నారు. కోకాపేటతో పాటు ఐడీ కారిడార్ లోని నార్సింగ్, గండిపేట్, నానక్ రాంగూడలో సైతం అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటివరకు విల్లాల వైపు మొగ్గు చూపేవారు కూడా అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. అందుకే విల్లాలను మించి ధరలు ఉంటున్నాయి.
ఇక అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ లో కొందరు విశాలమైన నివాసంలో ఉండేందుకు కొనుగోలు చేస్తూ ఉండగా, మరికొందరు పెట్టుబడి కోణంలో కొంటున్నారు. భద్రత, గ్రీనరీ, లగ్జరీ సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మరెన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు . డిమాండ్ ఉండటంతో బడా నిర్మాణ సంస్థలు అల్ట్రా ప్రీమియం అపార్ట్ మెంట్స్ నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. సుమారు 40 నుంచి అత్యధికంగా 58 అంతస్తుల వరకు ఇంటర్నేషనల్ రేంజ్ ఆర్కిటెక్చర్ తో నిర్మిస్తున్నారు .