ఉభయగోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిలో మాత్రం ఈ సారి ఎన్నికల సమరం ఉత్కంఠ రేపుతోంది. రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపటంతో రాజకీయం ఆసక్తిగా మారింది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపను టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ టిక్కెట్ ఆశించిన బొడ్డు భాస్కరరామారావు, గన్ని కృష్ణ లాంటి నేతలు అసంతృప్తికి గురయ్యారు. అయితే మాగంటి రూప మాత్రం విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. ఎంపీ మురళీమోహన్ మోకాలి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు రూప ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఇదంతా ఎన్నికల్లో తనకు కలిసివస్తోందన్న ధీమాతో రూప ఉన్నారు. ఇక జనసేన ఎంపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ కూడా ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ, ఎమ్మెల్యేగా తనకు ఉన్న అనుభవం ఈ ఎన్నికల్లో తన గెలుపుకు తోడ్పడుతుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బీసీ కార్డును ఉపయోగించి మార్గాని భరత్ ను అభ్యర్థిగా ఎంపిక చేసింది.
అసెంబ్లీ అభ్యర్థుల బలంపైనే ప్రధానంగా.. లోక్సభ అభ్యర్థుల విజయాకాశాలు ఆధారపడి ఉంటాయి. రాజమండ్రి అర్బన్ నుంచి టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానికి టిక్కెట్ ఇచ్చారు. ఈమె ఎర్రన్నాయుడు కుమార్తె. భవానీ అత్త వీరరాఘవమ్మ గతంలో రాజమండ్రి మేయర్ గా పని చేశారు. మామ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా చేశారు. వైసీపీ అభ్యర్థిగా రౌతు సూర్యప్రకాశరావు పోటీ చేస్తున్నారు. ఈయన పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన..సినిమా డిస్ర్టిబ్యూటర్ అత్తి సత్యనారాయణకు టికెట్ కేటాయించింది. రాజమండ్రి రూరల్ నుంచి రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున ఆకుల వీర్రాజు, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ కు టికెట్ దక్కింది. రాజానగరం నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి జక్కంపూడి రాజాకు టికెట్ దక్కింది. జనసేన నుంచి రాయపురెడ్డి చిన్న టికెట్ దక్కించుకున్నారు. జనసేన ఎంత ఎక్కువ ఓట్లు చీలిస్తే… టీడీపీ అభ్యర్థికి అంత ఎక్కువ మెజార్టీ వస్తుందన్న అంచనా ఉంది. అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కే మళ్ళీ రెండోసారి టికెట్ దక్కింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. వైసీపీ తరపున సత్తి సూర్యానారాయణ రెడ్డి, జనసేన అభ్యర్థిగా రేలంగి నాగేశ్వరరావు బరిలో ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాగా… వైసీపీ అభ్యర్థి బీసీ, జనసేన అభ్యర్థి కాపు. వైసీపీ అభ్యర్థి బీసీ అయినప్పటికీ.. ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ బలంగా ఉండటంతో పాటు… జనసేన అభ్యర్థి ఎన్ని ఓట్లు చీలిస్తే.. అంత ప్లస్ అవుతుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. వైసీపీ అండగా ఉండే కొన్ని వర్గాలు.. ఈ సారి… జనసేన వైపు చూస్తున్నాయి. ఎస్సీలతో పాటు సంప్రదాయంగా ఉన్న కొంత మంది కమ్యూనిస్టుల మద్దతుకూడా జనసేనకు దక్కనుంది. ఎలా చూసినా త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరు విన్నర్ అవుతారనేది ఆసక్తికరమే..!