మహర్షి సినిమా ప్రేక్షకుల్ని, అభిమానుల్నీ గందరగోళంలో పడేసింది. ఈ సినిమా టికెట్టు రేట్లు పెరిగినట్టు వార్తలొస్తున్నాయి. మల్టీప్లెక్స్ లో ఇప్పటి వరకూ టికెట్ రేటు 138 రూపాయలు ఉంటే…. గురువారం నుంచి రెండు వారాల పాటు 200 రూపాయలకు పెంచారు. సింగిల్ స్క్రీన్‌లో కూడా టికెట్ రేటు మారింది. 80 రూపాయల టికెట్ 110 రూపాయలు చేశారు. వంద రూపాయల టికెట్ ధర 125కి పెరిగింది. ధియేటర్ యాజమాన్యాలు కొత్త రేట్ల ప్రకారమే టికెట్లు అమ్మేస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లో అడ్వాన్సు బుకింగులు మొదలెట్టేశాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్టు రేటు పెంచుకోవడానికి మేం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారంటూ చెప్పుకుంటూ.. అధిక ధరలకు టికెట్లని అమ్మేస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌లో 30 శాతం టికెట్ రేటు పెరిగితే మల్టీప్లెక్స్‌లో 40 శాతం వరకూ ఉంది. అయితే ఈ రేట్లు ఒక్కో థియేటర్లో ఒక్కోలా ఉన్నాయి. కొన్ని థియేటర్లు పెరిగిన రేట్లు వసూలు చేస్తుంటే, ఇంకొన్ని పాత రేట్లకే కట్టుబడి ఉన్నాయి. ఈ విషయంలో చిత్రబృందం ఒకలా, ప్రభుత్వాలు మరోలా మాట్లాడడం గందరగోళానికి గురి చేసే విషయం. ప్రభుత్వం టికెట్ ధరని పెంచుకోవడానికి మాకు అనుమతి ఇచ్చిందంటూ చిత్రబృందం చెబుతోంది. కోర్టు ఉత్తర్వులనీ చూపిస్తోంది. స్వయంగా… తెలంగాణ రాష్ట్ర మంతి తలసాని శ్రీనివాస యాదవ్ రంగంలోకి దిగి… అసలు మేం అలాంటి ఉత్తర్వులే ఇవ్వలేదంటోంది. ఆంధ్రలో కలెక్టర్లు టికెట్ ధరని పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారంటున్నాయి. కానీ.. అలాంటి ఆధారాలేం చూపించడం లేదు. ఈ విషయంలో రేపటికి గానీ ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పటికే బుక్ మై షో ద్వారా టికెట్లని కొన్నవాళ్లు మాత్రం ఎక్కువ ధర చెల్లించి మహర్షి టికెట్లు కొన్నట్టైంది. ఒకవేళ ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలిస్తే… వాళ్లకు డబ్బులు రిఫండ్ వస్తాయా, రాదా? అనేది మరో పెద్ద ప్రశ్న.